Monday, 7 September 2009

జగన్నాటకం...

పసందైన రాజకీయ నాటకానికి రంగస్థల వేదికగా రాష్ట్రం మారింది. తెరచాటు వేషగాల్లు ఇప్పుడిప్పుడే పాత్రలతో సిద్ధమవుతున్నారు. తెరముందు వేషగాల్లు అప్పుడే వాళ్ల నటనా కౌషలం ప్రదిర్శించడం మొదలు పెట్టారు. కల్తీ లేని నటన, విమర్శకు వీలులేని అభినయం, యాచకులు నేర్చుకోదగ్గ వాచకం, స్వచ్చమయిన స్వార్దం, వెరసి మన ముందుకొచ్చిన జగన్నాటకం. ఒక ఉగ్రనరసింహ్ముని వేషం రాష్ట్రాన్ని నిప్పుల కొలిమిగా చేస్తానంటే, ఒక అమ్మవారి ఆకారం రక్తం ఏరులై పారిస్తానంటుంది. అన్ని వేషాలు కలిసి రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేస్తాయట.

ఈ నటచక్రవర్తులకు తోడు భజన బృందాలు. ఒకడు కీర్తనలు పాడుతడు, ఒకడు ప్రార్థనలు చేస్తాడు, మద్దెల వాయించేవాడు ఒకడయితే, తాళాలు కొట్టేవాడు మరొకడు, ఉడతలు పట్టేవాడు కూడా వీలుచూసుకొని చిడతలు కొడుతున్నాడు. ఈ విద్యలెందులో ప్రవేశం లేని వాళ్లు దరువుకు అనుగుణంగా, శృతి తప్పకుండా ఆరున్నొక్కరాగం ఆలాపిస్తున్నరు.

వేషమేదయినా, భజన ఎవరు చేసినా, ఏడుపు ఎవరేడ్చినా... ఈ నాటకంలో చివరగా అందరికీ కావలసింది ఒక్కటే, అదే యువరాజు గారి పట్టాభిషేకం. తండ్రి "ఆశయాలు" పూర్తిచేయడం ఆయన కుమారుడికి ఒక్కడికే సాధ్యమవుతుందట. తండ్రిగారి నాయకత్వ పఠిమా పాటవాన్ని జన్మతా అందిపుచ్చుకున్నాడట. ఇదంతా చూసి ఇదేమయినా మూర్చ రోగమా తల్లిదండ్రులకు ఉంటే వంశపారంపర్యంగా పిల్లలకు రావడానికి అని అనుకోకండి, కాదు..కుర్చీ రోగం. దానికీ దీనికీ తేడా ఒక్కటే, మూర్చతో కొట్టుకోవడం పుట్టుకతో వస్తే, కుర్చీని పట్టుకోవడం తల్లి లేదా తండ్రి మరణం నుండి సంక్రమిస్తుంది.

ఈ జరిగే తతంగం తోటి రాష్ట్రంలోని టీవీ చానెల్స్ కు కావలసినంత సరకు దొరికింది. కెమరా కన్నులకు ఇదో కలర్ ఫుల్ కార్నివాల్. చచ్చినోడి పెళ్ళికి వచ్చిందే కట్నం అన్న చందంగా SMS polls పేరుతో సందెట్లో సడేమియాలా శవాల మీద పేలాలు ఏరుకుంటున్నారు. చచ్చినవాడి ఆత్మశాంతి దేవుడెరుగు, బ్రతికిన వాల్లకి మనశ్శాంతిని లేకుండా చేస్తున్నారు.

రాజకీయ నాయకునికి ఉండవలసిన ప్రాథమిక లక్షణం, అందితే జుట్టు పట్టుకోవాడం, అందకపోతే కాళ్లు పట్టుకోవడం. ఇవి రెండూ దొరకక పోతే....నడుము పట్టుకోవడం. అక్కడనుండి మన వీలూ వివరం చూసుకొని అవసరానికి అనుగుణంగా వీలయితే పైకి, కాకపోతే క్రిందికి ప్రయాణం చేయొచ్చు. ఈ నడుమునే పండితులు "జఘనం" అంటే, నోరు తిరగని రాజకీయ నాయకులు "జగను" అంటారు.

-ఏకలింగం

-----------
(గత కొద్దిరోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయాలను, రాజకీయ నాయకుల ఓవర్ యాక్షను చూసి, థూ.. అనిపించి...)

Thursday, 3 September 2009

YS రాజశేఖర్ రెడ్డి గారుకి నా నివాళి

"YS రాజశేఖర్ రెడ్డి గారు ఇకలేరు".

ఉదయాన్నే ఏ వార్త వినకూడదనుకున్నానో అదే విన్నాను. 24 గంటల ఉత్కంఠకు తెరపడింది. ఇది నేను నమ్మలేని నిజం, జీర్ణించుకోలేని సత్యం.

సమకాలీన రాష్ట్ర రాజకీయాల్లో ఎదురులేని, ఎవరూ ఎదురించడానికి సాహసం చేయలేని నేత. గత ఎన్నికలలో ఒంటిచేత్తో పార్టీనీ అధికారంలోకి తెచ్చిన వ్యక్తి. అత్మవిశ్వాసానికి ప్రతీక. తనను నమ్ముకున్నవాళ్లకు మేలు చేయడం మరవడు అని అందరూ నమ్మిన వ్యక్తి. ఒక దశలో రాష్ట్రంలో నామమాత్రంగా మిగిలిపోయిన కాంగ్రేసు పార్టీకి, పంచే ఎగ్గట్టి, తలకు తలపాగా చుట్టి పాదయాత్ర ద్వారా మళ్లీ ప్రాణాలూది పదవిలోకి తెచ్చిన అసలు సిసలు నాయకుడు.

కాంగ్రేసు పార్టీలో రాష్ట్రం మొత్తం నుండి ఇంతగా అభిమానించిన నేత ఎవరూ లేరు.... ఇక ముందు కూడా ఉండరేమో..

నిన్న జరిగిన ప్రమాదంలో అశువులు బాసిన వై యస్ రాజశేఖర్ రెడ్డి, సుబ్రహ్మణ్యం, ఏ ఎస్స్ సి వెస్లీ, ఎన్‌ కే భాటియా, ఎం సత్యనారాయణ రెడ్డి గార్ల అత్మలకు శాంతికలుగుగాక...

Monday, 20 July 2009

బ్లాగరు పెళ్లిచూపులు...

"అబ్బాయ్ గారు ఏముద్యోగం చేస్తుంటారు?"
"మొన్నటివరకు చేసేవాడులేండి. ఇప్పుడు ఆపేసాడు. అయినా ఉద్యోగం ఎవడికి కావాలండి ఈరోజుల్లో"
"అంటే..ఉద్యోగం పురుష లక్షణం కదా..అందుకని"
"ఊరుకోండి సార్, ఉద్యోగం లేనంత మాత్రాన లక్షణాలు లేకుండా పోతాయా? పెద్దలు సంపాదించి ఇచ్చిన పదెకరాల భూమి మొన్ననే అమ్మేసాడు"
"ఉన్న భూమి అమ్మేస్తే ఏం చేసి బతుకుతాడు..అడుక్కతింటడా?"
"ఆ డబ్బుతో ఓ పది సర్వర్లు కొని ఇరవై బ్లాగులు తెరిచాము"
"అరెరె..అంతడబ్బుతో పేమెంట్ కోటా కింద ఒక జూనియర్ డాక్టర్ సీటే కొనుక్కొవచ్చుకదా?"
"మనకు పేమెంట్లు ఎందుకండి.. కామెంట్లు కావాలి. డాక్టర్ అయితే కేసుల కోసం వెతుక్కోవాలి.. అదే బ్లాగరయితే, మనమే కేసులు వేసుకోవచ్చు"
"ఇంతకూ అబ్బాయి చేసే పనేంటో??"
"చెప్పాను కదండీ..రెండుచేతులా ఓ ఇరవై బ్లాగులు రాస్తుంటాడు. ఇందులో మీకు తెలియనిది ఏముంది. ఇది కామెంట్ల పని, పేమెంట్ల పని కాదు. మీకు నచ్చితేనే సరి"
"వెదవది..పేమెంట్లు ఎవరికి కావాలండి. ఈరోజు వచ్చినెలాకరకు ఐపోతవి. అదే కామెంట్స్ అయితే కలకాలం ఉంటాయి. మీ దగ్గర దాచడం ఇష్టం లేదు. మొన్ననే ఒక సంబందం చూసాము. వాళ్లు కూడా మాతో ఇలాగే ఐదుబ్లాగులున్నాయి, రోజుకు 20 కామెంట్స్ వస్తాయని చెప్పారు. కానీ తీరాచుస్తే వాల్లకు వచ్చేవి రోజుకు ఐదారు కామెంట్స్ అని తెలిసింది"
"అబ్బే మీతో అబద్దం చెప్పడం ఎందుకు. మావాడికి ఉన్నవి ఇరవై బ్లాగులు, వాటికీ అదిరిపోయే అలెక్సా ర్యాంకింగ్స్. రోజు తప్పకుండా నలబై పైనే కామెంట్స్, వందకు పైనే హిట్లు వస్తాయి."
"హిట్లా? తిట్లా??"
"తిట్లయినా హిట్లే కదండి"
"అవును అది నిజమే అనుకో.. కానీ అందులో కామెంట్స్ అన్నీ మీవాడే మారుపేర్లతో రాసుకుంటాడని విన్నాము"
"మీకలాంటి అనుమానం ఏమీ అక్కరలేదు. కావాలంటే IP address లు కూడా ఇస్తాము. మీకు తెలీదేమో...ఎవరైనా మావాడి బ్లాగుల్లో కామెంట్స్ రాయకుండా మొండికేస్తే వారిపైన atrocity case కూడా పెట్టగలడు"
"మరి.. బీడీ సిగిరెట్ తాగడం లాంటివి..??"
"మరీ చీపుగా బీడీ, సిగిరెట్టేంటండి, మావోడు దర్జాగా లంక పొగాగు చుట్ట గుప్పుగుప్పున దమ్ములాగుతడు. మావోడి గొప్పతనం చెప్పుకోవడం కాదుగానీ, మాచుట్టుపక్కల ఎక్కడ కొంపలంటుకున్న మొదట చుట్టంటించుకునేది మావోడే"
"చాలా సంతోషం.."
"మావోడి గొప్పలు చెప్పుకోవాలంటే చాటభారతంలా ఎన్నటికీ తెగదు"
"అబ్బో..ఏంటవి?"
"బండితోలుతు బ్లాగింగ్ చేయగలడు. కళ్లుమూసుకొని కామెంట్స్ రాయగలడు, IP address ఇస్తే ఇంటి అడ్రస్స్ పట్టుకు రాగలడు"
"నిజంగా.."
"మరే, మీరు ఏరోజైనా చూసుకోండి. కూడలి, జల్లెడ సగం పేజీ మావోడి బ్లాగులతోనే నిండి పోతుంది. ఇన్ని అడిగారు మరి అమ్మాయి గురించి చెప్పారు కాదు"
"రూపవతి, బుద్దివంతురాలు, గుణవంతురాలు. ఇంటిముందుకు వచ్చిన బిచ్చగాన్ని వట్టిచేతులతో వెళ్ళగొట్టదు. కూడలిలో కనిపించిన బ్లాగును ఊరికే వదిలి పెట్టదు."
"మరి కామెంట్స్..అవీ..??"
"అదేకదా చెబుతున్నాను, దయగల చేయి. రోజుకు పది, పదిహేను కామేంట్స్ తక్కువ కాకుండా రాయదు. మొన్న మీవోడి బ్లాగులో కూడా కామెంటింది"
"ఆ చూసాం. కామెంట్ పెట్టిన రోజే తెలిసింది కాపురం చేసే కళ"
"కానీ మీవోడే స్పందించలేదట"
"కూడలిలో కనబడని బ్లాగరలకు సమాధానం చెప్పడు"
"ఏమో అనుకున్నను..ఈ అలవాటు కూడా ఉందా?"
"ఇంకా అవసరానికి పనికొచ్చే అలవాట్లూ చాలా ఉన్నయిలేండి"
"మరి పెళ్లికి తీరిక ఎప్పుడు దొరుకుతుందండి?"
"ఇప్పుడు బ్యాండ్‌విడ్త్ బాగుంది. బ్యాండ్‌మేళానికి తీరిక దొరకడం కష్టం. ఈ మధ్యలో అప్పుడో ఇప్పుడో ఫైబర్ ఆప్టిక్స్ కేబుల్ కట్ కాకపోదు. అప్పుడు పెట్టుకుందాం"
"శుభస్య శీఘ్రం .."


-ఏకలింగం
-------------
(ప్రేరణ నిచ్చిన Dr. Nadendla, Jr.doctor, Cardiac surgeon, NRI, Princess Grace Hospital, Landon గారికి కృతజ్ఞతలతో..)