Monday, 18 January 2010

Indian Avatars: డోంగ్రియా కోండ్ గిరిజనులు

ఎప్పటి నుండో చూద్దాం అనుకుంటున్న అవతార్ సినిమాకి టికెట్స్ ఈ వారం దొరకడంతో ఐమాక్స్ ౩డి లో నిన్నే ఈ సినిమా చూసాను. సినిమా నాకు నచ్చింది. స్థూలంగా నాకు అర్థం అయినంతలో కథేంటంటే..."పాండోరా ఉపగ్రహంపై ఉన్న విలువైన ఖనిజాన్ని (Unobtonium) త్రవ్వుకోడానికి ఒక కంపనీ (RDA) ప్రయత్నిస్తుంది. అయితే..వీరికి అడ్డంకిగా అక్కడే ప్రకృతిని ఆరాధిస్తూ నివసిస్తున్న నేటివ్ ప్రజలను (Na'vi) అక్కడ నుండి పంపేయాలి. అందులో భాగంగా మొదట అక్కడ ఉన్న ప్రజలతో సాన్నిహిత్యం పెంచుకోవాలి. అక్కడ ఉన్న ప్రకృతిని అర్థం చేసుకోవాలి, తర్వాత అక్కడి ఖనిజాన్ని సంపాదించుకోవాలి. పాండోరా మనుషుల జీవనానికి అనుకూలం కాదు, మనుషులు అక్కడ ఆక్సీజన్ లేకుండా బ్రతకలేరు కాబట్టి అక్కడి నేటివ్ ప్రజల దేహాలని, మానవుల DNA తో కలివి, నేటివ్ ప్రజల్లా అవతారాలను తయారు చేసి, ఈ అవతారాలను పాండోరా ప్రజల మధ్యకి పంపి, ప్రయోగశాల నుండి కంట్రోల్ చేస్తుంటారు. ఈ అవతారాల సాహాయంతో RDA కంపనీ పాండోరా పైన ఏంజేసింది, నావీలను అక్కడి నుండి పంపి విలులైన ఖనిజాన్ని స్వంతం చేసుకుందా లేదా అన్నది నేను చెప్పడం కంటే సినిమాలో చూస్తేనే బాగుంటుంది.

సినిమాలో సృష్టించిన "పాండోరా" ఒక అద్భుత లోకం. దట్టమైన అడవి. ప్రకృతితో మమేకమై జీవిస్తున్న ప్రజలు, విచిత్రమైన ఆచారాలు, వింత జీవులు, వాటితో అక్కడి ప్రజలకున్న అనుబంధం, రాకాసి పక్షులపై గగన విహారం, ఆకాశంలో తేలిపోయే పర్వతాలు, ఆ పర్వత చెరియల పైనుండి జలజలా రాలె సెలయేర్లు. ఇవన్నీ మనలోని ఊహలకు దృష్య రూపాలు. అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్ ఒక కలల లోకాన్ని మన కళ్ళ ముందుకు తెస్తాయి. సరే... ఈ వర్ణనలాపి, నా ఇష్టాయిష్టాలు కాసేపలా పక్కకుబెట్టి అసలు విషయానికొద్దాం.

ఈ సినిమాపై చాలా మంది ఇప్పటికే చాలా విశ్లేషణ చేసారు. ఎవరికి నచ్చింది వాళ్ళు చెప్పారు. ఎవరికి దొరికింది వాళ్ళు వెతుకున్నారు. నాకు మాత్రం ఈ సినిమా చూస్తున్నంత సేపు గుర్తుకొచ్చింది మన దేశంలో జరుగుతున్న అచ్చు ఇలాంటిదే ఒక సంఘటన. కాకపోతే ఈ సంఘటన అంతటి ప్రాముఖ్యత సంతరించుకోలేక పోవడానికి కారణం ఇది నిజ జీవితంలో జరుగుతున్న ఘటన, ఇందులో మనల్ను అబ్బుర పరిచే విజువల్ ఎఫెక్ట్స్ ఉండవు. హీరో గారి వీరోచిత విన్యాసాలు ఉండవు. సినిమాలో పవిత్రమైన చెట్టును కాపాడుకోవాలనుకుంటే, ఇక్కడ ట్రైబల్స్ తము ఎంతో పవిత్రంగా పూజించే కొండను కాపాడుకోవాలనుకుంటున్నారు. సినిమాలో Unobtonium ఖనిజం కోసం ప్రకృతిని కొల్లగొట్టాలని చూస్తే, ఇక్కడ బాక్సైట్ కోసం ప్రకృతిని వికృతంగా మారుస్తున్నారు. సినిమాలో లాగే ఇక్కడా గిరిజనులు విల్లంబులు ఎక్కుపెట్టి మర తుపాకులను ఎదుర్కొంటున్నారు. సినిమాలో కంపనీ పేరు Resources Development Administration (RDA), మన నిజజీవితంలో కంపనీ పేరు వేదాంతా రిసోర్సెస్ (Vedanta resources).

బళ్ళారి "గాలి" సోదరులు "భూమి"ని త్రవ్వుకొని, "ఆకాశం"అంత ఎత్తుకెదిగి, కర్ణాటక ప్రభుత్వానికి "నిప్పం"టించి, బీజేపి అగ్రనాయకులకే "నీళ్ళు" త్రాగించారు. ఇప్పుడు అక్కడ నడుస్తున్న ప్రభుత్వ ప్రాణాలు కాపాడుతున్న పంచభుతాలు వీళ్ళే అని అందరికీ తెలుసు. ఈ గాలికుంటు వ్యాది సోకిన కర్ణాటక ప్రభుత్వం అప్పటి నుండి కుంటుకుంటూ నడుస్తుంది. ఈ కర్ణాటక నాటకాన్ని తిలకించిన వాళ్ళందరూ మైనింగ్ మాఫియా కర్ణాటక ప్రభుత్వాన్ని శాషిస్తుందని గగ్గోళు పెట్టారు. గాలి సోదరుల చేతిలో బీజేపి నాయకులు కీలు బొమ్మలయ్యారని అన్నారు. మరి ఇక్కడ లోకల్ గా ఒక 300 ఎకరాల్లో ఖనిజాన్ని త్రవ్వుకొని బ్రతికే వీళ్ళకే ఇంత బలం ఉంటే, మూడు దేశాల్లో మైనింగ్ చేస్తూ, 9 కంపనీల నడిపిస్తూ, 27,264 ఉద్యోగులతో, 37 వేల కోట్ల నికర సంవత్సర లాభంతో నడిచే కంపనీకి ఇంత ఎంత శక్తి ఉండాలి. మన భారత ప్రభుత్వానికి కూడా కొన్ని బడా కంపనీలు దిశా నిర్దేశం చేస్తున్నాయని ఎవరైనా అంటే అది అతిశయోక్తిగా అనిపించవచ్చు కానీ అందులో కాస్తయినా నిజం లేక పోలేదు.

వేదాంత రిసోర్సెస్. లండన్ స్టాక్ ఎక్స్చేంజ్ (LSE) లో ట్రేడింగ్ చేసున్న కంపని. FTSE 100 లో ఒకటి. మార్కెట్ కాపిటల్ పరంగా LSE మైనింగ్ సెక్టార్లో ఎనిమిదవ అతిపెద్ద కంపెని. India, Zambia and Tasmania లో మైనింగ్ చేస్తుంది (ఇండియా లో ట్రేడింగ్ చేస్తున్న వాళ్ళకు వేదాంత పిల్ల కంపనీ Sterlite Industries గురించి తెలిసే ఉంటుంది). వీళ్ళకు ఒరిస్సాలో "నియమ్ గిరి" పర్వతంపై పుష్కలంగా ఉన్న బాక్సైట్ ఖనిజం కావాలి. కానీ అది అక్కడ నివసిస్తున్న డోంగ్రియా కోండ్ గిరిజనులకు పవిత్రమైన పర్వతం. సినిమాలో మాదిరిగానే ఈ కంపనీ వాళ్ళు గిరిజన అభివృద్ధి పేరుతో అక్కడికి రోడ్లు వేసారు. స్కూల్లు కట్టించించారు. వాళ్లకి ఇంగ్లీష్ నేర్పించారు. ఇప్పుడు మెల్లిగా అక్కడ నుండి వాళ్లను సాగనంపడానికి తయారయ్యారు. దీనికి అక్కడి గిరిజనులు, పర్యవరణవేత్తలు అభ్యంతరం చెప్పారు. సుప్రీంకోర్ట్ కు వెళ్ళారు. కానీ మన "భారత న్యాయస్థానం" ముందు ఎవరి వాదన పనిచేయలేదు.

వేదాంత ఇప్పుడీ కొండను తవ్వితోడుకోవడానికి సుప్రీంకోర్ట్ నుండి అనుమతి సంపాదించింది. డోంగ్రియా కోండ్ ప్రజలను అక్కడ నుండి తరిమేయడానికి రాజముద్రికతో వస్తుంది. ఇక వాళ్లకు ఆడ్డంగా మిగిలింది అక్కడ ఉంటున్న నక్సలైట్స్. వాళ్ళను ఈ అడవీ ప్రాంతం నుండి సాగనంగే పని మన హోం మంత్రి చిదంబరం చేపట్టాడు. ఆపరేషన్ గ్రీన్ హంట్ పేరు మీద నక్సలైట్లనీ, నక్సలైట్ల పేరు మీద అక్కడుంటున్న గిరి పుత్రులను తుపాకీ బెదిరింపులతో సాగనంపుతున్నారు. అక్కడ నుండి ఇప్పుడీ గిరిజనులను తరిమి ఆ ప్రాంతాం మొత్తాన్ని మైనింగ్ కంపనీలకు అప్పజెప్పడానికి, గన్ నీడలో గనులు త్రవ్వడానికి ఈ ఆపరెషన్ మొదలు పెట్టారు అన్నది చిదంబర రహస్యం. ఈ పనిపై చిదంబరానికు గల నిబద్ధతకు కారణం.. ఈయన గతంలో ఈ కంపనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ లో ఒక్కడు. 2003 వరకు ముంబై హై కోర్ట్ లో ఈ కంపనీ ప్రతినిధిగా హాజరయ్యాడు (Wikipedia).

అంతర్జాతీయంగా Survival International డోంగ్రియా కోండ్ గిరిజనుల తరుపున పోరాడుతుంది. వివిధ పర్యావరణ సంస్థల మద్దతు కూడగట్టడానికి ప్రయత్నిస్తుంది. పర్యావరణవేత్తలు మన దేశంలో (BBC), లండన్ లో చాలా సార్లు London Stock Exchange ముందు Bank of England ముందు ప్రొటెస్ట్ చేసారు BBC). ఈ కంపనీ ట్రేడింగ్ ఆపేయమని, LSE నుండి డిలిస్ట్ చేయమని విజ్ఞప్తి చేసారు. కానీ ఇంగ్లాండ్ ప్రభుత్వం లెక్కజేయదు ఎందుకంటే...చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్ కు ఈ కంపనీలో 4.1 మిలియన్ డాలర్ల పెట్టుబడులున్నాయి (BBC. అది అప్పుడు. ప్రస్తుత పెట్టుబడుల విలువ 25 మిలియన్ డాలర్లు). ఒక్క చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్ కే కాదు, ఇతర హెడ్జ్ ఫండ్ కంపనీలకు ఇందులో చాలా పెట్టుబడులున్నాయి. వాళ్ళకు ఇదో బంగారు గుడ్లు పెట్టే బాతు.

కుక్క కరిచిందని, పంది ప్రదక్షిణలు చేసిందని సంచలమైన వార్తలు ప్రసారం చేసి మెరుగైన సమాజం కోసం 24 గంటలు మొరిగే మన తెలుగు మీడియా ఇలాంటి విశయాల్లో వ్యూహాత్మక మౌనాన్ని పాటిస్తాయి. ఈ విశయం పై తెలుగులో ఎక్కడా పెద్దగా వార్తలు వచ్చినట్లు నాకు కనబడలేదు. కేవలం ఆంధ్రజ్యోతిలో అల్లం నారాయణ గారు వ్రాసిన ప్రాణహితలో తప్ప.


వేదాంత గురించి చదివినప్పుడల్లా ఈ కంపనీ చేస్తున్న పని గురించి కొందరికైన చెప్పాలనిపించేది.ఇప్పుడు అవతార్ సినిమా మూలంగా ఈ విషయంపై రాయడానికి సందర్భం వచ్చింది.

- ఏకలింగం