Friday, 30 July 2010

మాలిక టీమ్...

మాలికతో పాటు డెవలప్ చేసిన మరొక సైట్ "కేక". దీనిని మైక్రోబ్లాగింగ్ కోసం అభివృద్ది పరచడమైనది. పేజీల కొద్ది వ్రాసే ఓపిక లేనప్పుడు, చెప్పాలనుకున్నది సింపుల్‌గా చెప్పాలనుకున్నడు ఒక్క కేక వేయండి.

కేకను డెవలప్ చేసి, సమర్ధవంతంగా నిర్వహిస్తున్నది విమల్... మరో పేరు "డ్రుపాల్ విమల్". వెబ్‌కు సంబంధించి ఎటువంటి పనినైనా "డ్రుపాల్" CMS ఉపయోగించి చేసేయడం విమల్ గొప్పతనం. "కేక" నిర్వహననే కాకుండా మరింత వేగవంతమైన అగ్రిగేటర్ కోసం తను పని చేస్తున్నాడు.

ప్రస్తుతం భరద్వాజ్, పద్మ ఇద్దరూ కలిసి "రియల్ టైమ్" అగ్రిగేటర్ తయారు చేసే ప్రాజెక్ట్ చేస్తున్నారు. వీలైతే భవిష్యత్తులో మాలిక కంటే వేగవంతమైన సంకలిని తయారు కావచ్చు.

తొందర్లో ఆర్కే (the Yogi), మాలిక నిర్వహన బాద్యతలు చెపట్టబోతున్నాడు.

ఇవి ప్రస్తుత టీం పనులు. మాలిక డెవలప్ చేయడానికి టీమ్ సభ్యులే కాకుండా శరత్, వికటకవి శ్రీనివాస్, జీవని ప్రసాద్, ఇంకా కొందరు వాళ్ళకు తోచిన సహాయం సలహాల ద్వారా, సూచనల ద్వారా, ప్రచారం ద్వారా చేసారు. మరి కొంతమంది మాలిక టీం తో కలిసి మరింత అభివృద్ది చేయడానికి వాళ్ళ ఉత్సుకత చూపించారు. వాళ్లందరికీ ధన్యవాదాలు.

అడిగిన వెంటనే మాలిక కోసం శ్రమ అనుకోకుండా వాళ్ళ సమయాన్ని కేటాయించి బటన్ డిజైన్ చేసి పంపిన శివ బండారు, జగదీశ్ రెడ్డి, ధరణీరాయ్ చౌదరి లకు మాలిక టీం తరుపున ప్రత్యేక ధన్యవాదాలు. వాళ్ళు పంపిన మాలిక బటన్స్ ఇక్కడ చూడొచ్చు.


ఇదీ క్లుప్తంగా మాలిక గురించిన సమాచారం. మాలిక గురించి మరింత సమాచారం ఏమైనా కావాలనుకుంటే ఆడగండి.

Thursday, 29 July 2010

గత, ప్రస్తుత మరియు భవిష్య మాలిక

ప్రతి బ్లాగర్ తను వ్రాసింది పోస్ట్ చేయాగానే కోరుకునేది తొందరగా తన టపా అగ్రిగేటర్లో రావాలని, ఇతరులు చదవాలని. అంతేగాక, బ్లాగులు చదివే అందరికీ ఉండే ఆసక్తి ఏంటంటే ఏ బ్లాగులో ఎవరేమనుకుంటున్నారు అని. మాలిక మొదలు పెట్టినప్పుడు ఈ రెండు విశయాలపైన శ్రద్ద పెట్టి, టపాలు వీలైనంత తొందరగా మాలికలో వచ్చేట్లు, కామెంట్లను స్నిప్పెట్స్ లా కాకుండా పూర్తిగా చూపించేట్లు డెవలప్ చేయడం జరిగింది. మొదట్లో మాలికలో కొత్త టపాలు/వ్యాఖ్యలు అన్నీ ఒకే వరుసలో వచ్చేవి. ఇలా ఒకే వరుసలో చూపించడం వలన బ్లాగర్లు వ్రాసింది తొందరగా మాలిక నుండి వెళ్ళిపోయేవి. దీనికి పరిష్కారంగా టపాలు/వ్యాఖ్యలు రెండు వరుసల్లో వచ్చేట్లు మార్చడం జరిగింది.

తరువాత కాలంలో మాలికలో ఫోటోబ్లాగులు, వార్తలు, వెబ్ పత్రికలు చేర్చడంతో పాటు టపాలు, వ్యాఖ్యలు వాటంతటవే రీలోడ్ అయ్యేలా చేయడం జరిగింది. కానీ గత కొద్ది రోజులుగా, సర్వర్లలో మార్పుల కారణంగా కొన్ని ఫీచర్స్ తొలగించాము. అవి ఏమిటంటే...

1) No auto-reload
2) No news
3) No new webzine posts
4) No Limit on number of posts

ఆటో రీలోడ్ వలన కొంత బ్యాండ్‌విడ్త్ వేస్ట్ అవడం తప్ప పెద్దగా ఫలితం లేదు. భవిష్యత్తులో కూడ ఆటో రీలోడ్ అవసరం రాకపోవచ్చు. మాలిక లో వార్తలు ఇవ్వడం కూడా ఇక ముందు ఉండక పోవచ్చు. ఎందుకంటే తాజా వార్తలనందించే ఎన్నో వెబ్‌సైట్‌లు అందులోబాట్లో ఉన్నప్పుడు ఇక్కడ వార్తలు ఇవ్వడం అనవసరం అనుకుంటాము. ఇక వెబ్ పత్రిల కోసం ఒక ప్రత్యేకమైన పేజీ తయారుచేసి వాటిని రియల్‌టైమ్ డిస్ప్లే‌లా ఇవ్వాలని అనుకుంటున్నాము. దానికి కొద్దిగా సమయం పడుతుంది. ఇంతకు ముందు మాలిక ప్రతి బ్లాగు నుండి కేవలం రెండు టపాలు మాత్రమే చూపించేది.ఇప్పుడు ఆ లిమిట్ లేదు. ఇక ముందు లిమిట్ ఉంచాలా లేదా అన్నది బ్లాగర్లు రోజుకు ఎన్ని టపాలు వ్రాస్తున్నారు, వాటి వలన మిగతా టపాలు కొట్టుకు పోతున్నాయా అన్న దానిపై ఆధారపడి ఉంటుంది.


ప్రస్తుతం మాలికలో వీలుకానివి:
1) సెర్చ్
మాలికలోని పేజీలన్నీ (ఒకటీ, రెండు తప్ప) డైనమిక్ పేజీలే అవడంతో, మాలిక సర్వర్లో ఏమీ స్టోర్ చేయకపోవడంతో సెర్చ్ చేయడానికి ఏమీ లేదు.
2) కొన్ని బ్లాగుల నుండి కామెంట్స్
ప్రస్తూతం మాలికలో కామెంట్స్ అన్ని బ్లాగుల నుండి రావడం లేదు. కొన్ని బ్లాగులకు మాడరేషన్ లేక పోవడంతో స్పామ్ కామెంట్స్ ను అరికట్టడానికి అలాంటి బ్లాగుల్లో నుండి కామెంట్స్ తోసుకోవడం లేదు. మీ బ్లాగులో స్పామ్ కామెంట్స్ లేకున్నా కూడా మాలికలో మీ బ్లాగు నుండి కామెంట్స్ కనబడకపోతే, admin@maalika.org కు ఈమేయిల్ ఇవ్వండి.

మాలిక మొదలు పెట్టిన కొత్తలో వచ్చిన సూచనల, సలహాల ప్రకారం ఇక్కడ ఆడ బ్లాగర్లు, మగ బ్లాగర్లు, జూనియర్ బ్లాగర్లు, సీనియర్ బ్లాగర్లు, ఎక్కువ వ్రాసిన బ్లాగర్లు, తక్కువ వ్రాసిన బ్లాగర్లు అన్న భేదాలు చూపదల్చుకోలేదు. మాలికలో అందరూ సమానమే.

కొన్ని బ్లాగులు మాలికలో కనబడడం లేదు ఏమైనా కారణమా అని కొందరి సందేహం. మొదట మాలికను పరిక్షించడానికి రెగ్యులర్‌గా కనబడే కొన్ని బ్లాగులు తీసుకొని చూడడం, వాటితోనే విడుదల చేయడం అయింది. ఆ తర్వాత బ్లాగర్ల రిక్వెస్ట్ ప్రకారం వాళ్ళవాళ్ళ బ్లాగులు మాలికలో కలపడం జరిగింది. అంతేకాని ఎటువంటి కారణం లేదు. ఎవరి బ్లాగునైనా మాలికలో కలపడానికి ఎటువంటి అభ్యంతరం లేదు.

ముందుముందు...
తెరచాటు పనులన్నీ చక్కబెట్టి, మాలిక కుదురుగా నడుస్తుందనుకున్న తరువాత ఫ్రంట్‌ఎండ్ డిజైన్‌లో మార్పులు చేర్పులు జరుగొచ్చు. రియల్‌టైమ్ అగ్రిగేషన్ కోసం ప్రయాత్నాలు చేస్తున్నము. ఫోటో బ్లాగులు, వెబ్ పత్రికలు మొదటి పేజిలోకి వచ్చేట్లు డిజైన్ మార్పులు చేయాలనుకుంటున్నాము. ఇవే కాకుండా మాలిక అనుబంధ వెబ్‌సైట్లు కొన్ని రావచ్చు. అవి ఏమిటన్నది తొందర్లోనే చెప్తాము.

మాలికను ఎవరిపైనా పోటీకి పెట్టలేదు. మాకు ఎవరితోనూ పోటీలేదు, మాకెవరూ పోటీకాదు. మాలిక ఒక తటస్థ వేదిక మాత్రమే. ఇది అనతికాలంలోనే ఇంతలా ఆదరణకు నోచుకోవడం సంతోషం కలిగించే విశయం. అయితే, అప్పుడే సంవత్సరాల నుండి రంగంలో ఉన్న అగ్రిగేటర్లతో ఇంకా దినాలు లెక్కబెట్టుకుంటున్న మాలిక ను పోల్చి మా స్థానం ఇది అని తేల్చేస్తున్నారు. తెలుగు బ్లాగు అగ్రిగేటర్లలో మాలిక స్థానం ఏదైనా ప్రస్థానం మాత్రం ఆగదు. హిట్లెన్ని వచ్చినా, పేజ్ ర్యాంక్ ఎంతైనా, అలెక్సా ర్యాంకింగ్ ఎటుపోయినా, ప్రత్యేక ప్రచారం ఉన్నా/లేకపోయిన మాలిక మాత్రం ముందుకు సాగిపోతూనే ఉంటుంది. అవసరానికి తగ్గట్లు, వీలైనంతలో కొత్త ఫీచర్స్ అందిస్తూనే ఉంటుంది.


(రేపు మాలిక అల్లికలో సహాయపడ్డవాళ్ళ గురించి...)

Wednesday, 28 July 2010

మాలిక బాలారిష్టాలు

సుమారు మూడు నెలల క్రితం, మడిగట్టుకోని బ్లాగర్లను అడ్డ మీద మనతోపాటు ఉండనిద్దామా లేక హారతిచ్చి పంపిద్దామా అని ప్రజాభిప్రాయ సేకరణ పెట్టేంత వరకు ఒక కొత్త అగ్రిగేటర్ పెట్టాలి అన్న ఆలోచన ఏమీ లేదు. కాని పెద్దన్న అనుకున్నవాళ్ళే వద్దని వెళ్ళగొడతానన్నప్పుడు తెలుగు బ్లాగుల్లో ఒక తటస్థ వేదిక యొక్క అవసరం తెలిసొచ్చింది. ఆ పోస్ట్ చూసిన తర్వాత, బ్లాగర్లు ఏం వ్రాయాలో/వ్రాయకూడదో నిర్ణయించని, బ్లాగు వ్యవహారాల్లో తలదూర్చని ఒక సంకలినిని తయారు చేయాలి అన్న నిర్ణయం జరిగింది. ఇంతకు ముందు ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నా ఈసారి మాత్రం అలా వదిలేయదల్చుకోలేదు.

వెంటనే నేను, భరద్వాజ్, ఆర్కే, విమల్, పద్మ కలిసి ఓ యాక్షన్ టీం రెడీ అయింది. మొదట head-on collision కే సిద్ధమయ్యాము. kadali.org పేరుపైన అచ్చుగుద్దినట్లు ఒక సైట్ చేయడానికి అన్నీ ఏర్పాట్లు జరిగిపోయాయి. సైట్ రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది. ఒక పదిహేను రోజుల్లో మొదటి దశ అగ్రిగేటర్ పనికి సిద్ధం అయింది. తొందర్లోనే ఒక వేగవంతమైన అగ్రిగేటర్ వస్తుంది అని, "ఉప్పొంగే కడలి" అని పోస్ట్ వ్రాసి చెప్పడం జరిగింది.

అయితే...ఎలాగూ ఇంత చేసి కాపీ కొట్టారు అన్న పేరు ఎందుకు తెచ్చుకోవాలి, పోటీకి వెళ్ళినట్లు కాకుండా మనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుందాం, ఒక ఆదర్శవంతమైన సంకలిని తయారు చేద్దాం అని, మా నిర్ణయం మార్చుకుని కడలి పేరు కాకుండా ఇంకేదైనా పేరు పెట్టాలనుకున్నాము. అప్పుడు భరద్వాజ్ మాలిక పేరు బాగుంటుందని అది పెడదామని ఆ పేరు రిజిస్టర్ చేయించాడు.

ఆ తర్వాత ఎక్కడ నుండి హోస్ట్ చేద్దామని కొన్ని రోజులు తర్జనభర్జనలు జరిగాయి. మొదట కొత్త అకౌంట్ తీసుకోవడం ఎందుకు, విమల్‌కు అల్‌రెడీ అకౌంట్ ఉన్న డ్రీమ్‌హోస్ట్ (http://dreamhost.com) సర్వర్ పై నుండి మాలికను నడుపుదాం అనుకున్నా, వాడు cron jobs నడపడానికి వీలుకాదు అని చెప్పడంతో తక్కువ ధరకు ఎవడు హోస్టింగ్ అకౌంట్ ఇస్తుండని చూస్తే వెబ్‌హోస్టింగ్‌పాడ్ (http://webhostingpad.com) వాడు కనబడ్డాడు, నెలకు రెండు డాలర్లే, ఆలసించిన ఆశాభంగం, ఈ ఒక్క రోజే ఈ అవకాశం అని బోర్డ్ పెట్టుకొని. హమ్మయ్య...కరెక్ట్ టైమ్‌లో అగ్వకు దొరికిండు, మళ్ళీ ఈ ఆఫర్ రేపు ఉంటుందో లేదోనని వెబ్‌హోస్టింగ్‌పాడ్ వానితో వెంటనే ఓ మూడేళ్ళకు సర్వర్ గుత్తకు మాట్లాడుకున్నాము(ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఆ బ్యానర్ అలాగే ఉంది). ఆ తర్వాత అన్ని ప్రోగ్రామ్స్ బాగానే నడుస్తున్నాయని ఒకటి, రెండు రోజులు పరిక్షించి ఏప్రిల్ 19th, 2010 రోజు మాలిక పూరిస్థాయిలో విడుదల చేయడం జరిగింది.

మాలికకు తెలుగు బ్లాగర్ల నుండి మేము ఊహించని దానికంటే మంచి స్పందన వచ్చింది. కొద్ది రోజుల్లోనే అందరి ఆదరనకు నోచుకొని తనకంటూ ఒక స్థానాన్ని కల్పించుకుంది. కానీ... అసలు కష్టాలు అప్పుడే మొదలయ్యాయి.

మే 25st, 2010 రోజు హఠాత్తుగా మాలిక అకౌంట్ సస్పెండ్ అయింది అన్న మెసేజ్ చూసి ఇదేం గొడవరా బాబూ అని వెంటనే web hosting pad వాన్ని ఆడగడం జరిగింది. వాడేమో "మీ ప్రోగ్రామ్స్ మా సర్వర్ cpu అంతా వాడుకుంటున్నాయి అందుకే మీ అకౌంట్ సస్పెండ్ చేసి పారేసాము" అని తీరిగ్గా చెప్పాడు. సరే మేము ప్రోగ్రామ్స్ అన్నీ "low priority" నడిపిస్తాము, మీ cpu కు ఏమీ కాకుండా, తొందరగా మళ్ళీ అకౌంట్ ఇవ్వరా బాబు లేక పోతే మా ఇజ్జత్ పోయేట్టుంది అని వేడుకుంటే "మళ్ళీ ఇలా చెయ్యొద్దని" వార్నింగ్ ఇచ్చి అకౌంట్ అక్టివేట్ చేసాడు. బ్రతుకు జీవుడా అనుకొని ప్రోగ్రామ్స్ అన్నీ మార్చాము, cpu పైన ఎఫెక్ట్ పడకుండా, అలాగే అగ్రిగేషన్ స్పీడూ తగ్గకుండా.

అలా ఓ నెల పదిహేను రోజుల పాటు అన్నీ బాగానే నడిచాయి. కానీ, జులై 14th, 2010 రోజు మళ్ళీ కథ మొదటికి వచ్చింది. సేమ్ స్టోరి. మళ్ళీ అకౌంట్ సస్పెండ్ అయిన మెసేజ్. ఈసారేమైంది అని అడిగితే, మీ ప్రోగ్రామ్స్ చాలా memory వాడుకుంటున్నాయి. మీరు షేర్డ్ సర్వర్ లో ఈ ప్రోగ్రామ్స్ నడపడానికి వీలు కాదు. మళ్ళీసారి మీరు ఈ ప్రోగ్రామ్స్ నడపనని మాటిస్తేనే అకౌంట్ ఇస్తా అని ఖరాకండిగా చెప్పాడు. అలా అంటే ఎలా, మీరే ఏదో దారి చూపండి స్వామీ అంటే, మీ లాంటి వాళ్ళ కోసమే మేము డెడికేటెడ్ సర్వర్లు, అటు ఇటు కాకుండా ఉండే వర్చువల్ ప్రైవేట్ సర్వర్లు పెట్టాము. మీరు అక్కడ ఎగిరినా దుంకినా తందనానలాడినా ఎవరూ అడగరు. ఆ ఆకౌంట్ తీసుకొని అక్కడ మీ ఇష్టం వచ్చినట్లు చేసుకోండి. కానీ దానికి కొంచెం ఖర్చవుతుంది అని అన్నాడు.

మెల్లిగా బ్లేడు బయటకి తీస్తున్నాడని అర్థం అయింది. సరే... వాటికి ఎంతంటాడో చూద్దాం అని
ఎంత? అని అడిగితే
నెలకు $50 అని చెప్పాడు. (http://www.webhostingpad.com/vps-package.html)

"అన్నా... నమస్తే" అని ఓ సలామ్ కొట్టి వచ్చాము.

వీడేదో తిరుపతి గుండు చేస్తడనుకుంటే సర్వాంగ క్షవరం చేయడానికి రెడీ అయ్యాడు. వీడితో వెలితే పని అయ్యేట్లు లేదనుకుని, డ్రీమ్ హోస్ట్ వాడు ఏమైనా సందిస్తాడేమో అని వాన్ని అడిగితే, "చల్... గా కథలు గిక్కడ నడ్వై" అని తిట్టినంత పని చేసి పంపాడు.

ఇప్పుడేలా మరి. మంత్రసానితనానికి ఒప్పుకొని మధ్యలో వదిలిపెడతా అంటే వీలుకాదు. డెడికేటెడ్ సర్వర్ తీసుకొని నాటకం నడుపుదాం అంటే అంతో ఇంతో ఖర్చు అయ్యేట్లు ఉంది. మరెలా అంటే, ఒక్క సారి తొడకొట్టిన తర్వాత మంట పుట్టినా బొప్పి కట్టినా వెనక్కి వెల్లొద్దని, నాతో పాటు సర్వర్ ఖర్చులు తానూ పంచుకుంటాని భరద్వజ్ ముందుకొచ్చాడు.

Hakuna matata అనుకుని, పొత్తుల సర్వర్లతోటి ఎప్పుడైనా కిరికిరే అని చెప్పి, సరాసరి డెడికేటెడ్ సర్వర్ కాకుండా మొదట ఓ వర్చువల్ ప్రైవేట్ సర్వర్(VPS) తీసుకుని చూడాలనుకున్నాము. ఈసారి ఒక్కసారిగా సంవత్సరాల కొద్ది కాంట్రాక్ట్ తీసుకోకుండా మొదట చీపుగా ఓ సర్వర్ తీసుకొని అక్కడ పని మొదలుపెట్టి బాగుంది అనిపిస్తే పూర్తిగా అక్కడికి మారిపోదాం అని నిర్ణయించికుని ఎవడు చీపుగ వర్చువల్ సర్వర్ ఇస్తుండు అని గూగులోన్ని అడిగితే, వాడు VPSlink వాని పేరు చెప్పాడు. VPSlink, VPSlink... మాకో వర్చువల్ సర్వర్ చీపుగా కావాలి ఎంతకిస్తావు అని అడిగితే, డెడ్ చీపుగా నెలకు $8 కే ఇస్తానన్నాడు. సరే ఇదేదో బాగానే ఉంది కదా ఓ నెల రోజుల పాటు చూద్దాం అని వాని వెంట వెళ్ళాము. వాడేమో, వినాయకున్ని చేసివ్వరా అంటే వాడబ్బను చేసిస్తా అని లింగం చేతిలో పెట్టినట్లు ఓ బేసిక్ సర్వర్ చేతికిచ్చాడు. అందులో ఏమీ ఇంస్టాల్ చేసుకోడానికి వీళులేదు. కేవలం ప్రాసెసర్, బ్యాండ్‌విడ్త్ వాడుకోవడం తప్ప. మెమొరీ కూడా ముష్టేసినట్టు 64MB ఇచ్చాడు. ఏదో ఒకటి ప్రస్తుతం షో నడిపించడానికి ఈ మాత్రం చాలు అని, మళ్ళీ ప్రోగ్రామ్స్ అన్నీ మార్చి, అక్కడ ప్రాసెసింగ్, వెబ్‌హోస్టింగ్‌పాడ్ వాని దగ్గర షోయింగ్‌లా చేసాము. అప్పటి నుండి ఇప్పటి వరకు మాలిక అలాగే నడుస్తుంది. కానీ ముందు ముందు ఇంకా డెవలప్ చేయడానికి ఈ సెటప్ సరిపోదు.

ఎప్పటికైనా తప్పేట్టు లేదనుకొని మొన్ననే ఒక డెడికేటెడ్‌ సర్వర్‌కు బేరంపెట్టి ఓ తెల్ల దొరకు బయాన కూడా ఇచ్చాము. వచ్చే నెల, 15 నుండి మాలిక డెడికేటెడ్ సర్వర్ నుండి నడుస్తుంది. అయితే ఈ డెడికేటెడ్ సర్వర్‌ను కేవలం ప్రాసెసింగ్ సర్వర్‌లా ఉపయోగించుకుని, హోస్టింగ్‌ మాత్రం వెబ్‌హోస్టింగ్‌పాడ్ సర్వర్ నుండే కొనసాగుతుంది. వెబ్‌హోస్టింగ్‌పాడ్ వాన్ని ఊరికే వదిలివేయడం ఇష్టం లేదు. వాడితో తిన్న డబ్బులు కక్కించాల్సిందే. అంతే కాకుండా డెడికేటెడ్ సర్వర్లోనే వెబ్ సర్వర్ పెట్టుకుంటే, సైట్ సెక్యూరిటీతోపాటు సర్వర్ సెక్యూరిటికీ కూడా చూస్తూ 24 గంటలు కుక్క కాపలా కాయాల్చి వస్తది. ఏమాత్రం సందు దొరికినా ఏ టర్కీ వాడో వచ్చి జండా ఎగరేసి జై కొట్టగలడు. ఆ తిప్పలు తప్పించుకోవడానికి డ్యూయల్ సర్వర్ కాన్ఫిగరేషన్‌లో నడపాలని నిర్ణయించుకున్నాము.


ఇవీ మాలిక బాలారిష్టాలు. వచ్చే టపాలో భవిష్యత్తులో మాలిక ఎలా మారబోతుంది. ఏ ఫీచర్స్ ఉంటాయి, ఏవి ఉండవో చూద్దాం.
(పని ఒత్తిడి వల్ల ఈ రోజు కామెంట్స్ అప్రూవ్ చేయడానికి కొద్దిగా టైమ్ పట్టొచ్చు... )

Tuesday, 27 July 2010

వంద రోజుల మాలిక

మాలిక అగ్రిగేటర్ మొదలుపెట్టి ఈనాటికి వంద రోజులు.

ఈ వంద రోజుల నుండి ఎన్నో ఆటుపోట్లతో, పొరపాట్లతో, కొన్ని కష్టాలతో మరికొన్ని నష్టాలతో ఇంకా మాలిక ముందుకు వెళుతూనే ఉంది.

కొంత మందికి కుతూహలం... ఇది ఎవరు పెట్టారని. కొందరు పెద్దమనుషుల ఆరోపణల... ఒక బ్లాగర్ను(?) ఒక సంకలినిని నుండి తొలగించినందుకే మాలికలల్లారని. మరి కొంత మందికి సంతోషం ఈ అగ్రిగేటర్లో వాళ్ళేం వ్రాసినా (బూతులు కానంత వరకు) వాళ్ళ బ్లాగును తొలగిస్తామని బెదిరింపులు ఉండవని.

ఈ శతదినోత్సవం సందర్భంగా మాలిక పుట్టుపూర్వోత్తరాలు, కష్టాలు, బాలారిష్టాలే కాకుండా ఉప్పొంగాలనుకున్న కడలి మాలికలా మారిన వైనం...వగైరా వగైరా మీతో పంచుకోవాలనుకుంటున్నాము.

రేపటి టపాలో మాలిక మొదలు పెట్టడానికి కారణాలు, మేము పడ్డ ఇబ్బందులు, మరియు ఎల్లుండి టపాలో భవిష్యత్తులో మాలిక ఎలా ఉంటుందో/ఎలా ఉండదో చదవండి.

మాలికను ఇంతలా ఆదరించిన/ఆదరిస్తున్న అందరికీ కృతజ్ఞతలు.