Friday, 4 June 2010

నేన్నేర్చుకున్న బ్లాగు పాఠాలు: బ్లాగుల్లో భాషా బానిసత్వము

భాష ఒక స్రవంతి. కాలానుగుణంగా భాష పరిణామం చెందుతుంది. కాలక్రమంలో కొత్త పదాలు వాడుకలోకి వస్తాయి, పాత పదాలు కనుమరుగయి పోతాయి. కొన్ని సంవత్సరాల క్రితం వాడుకలో ఉన్న పదాలు ఇప్పుడు పుస్తకాలకే పరిమితం అయ్యాయి. ఇప్పుడు వాడుకలో ఉన్న పదాలు రేప్పొద్దున కనబడకుండా పోతాయి. దాన్నెవ్వరూ ఆపలేరు.

ఇంటర్‌నెట్, కంప్యూటర్, హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ ఇలాంటి పదాలకు తెలుగులో సరి సమానమైన పదాలు లేవు. ఆ మాటకొస్తే, ఇప్పుడు వాడుతున్న అర్థంతో ఏ భాషలోను ఆ పదాలకు సరిసమానమైన పదాలు లేవేమో? కానీ ఇప్పుడు ఈ పదలు వాడుకలోకి వచ్చాయి. ఈ మాటలకు అర్థం ఏమిటో ఇంచుమించు చదువుకున్న ప్రతి ఒక్కరికీ తెలుసు.

వాడుక భాషతో, రోజూ వాడుకునే పదాలతో రాసిన సొగసు ఇంకే విధంగా వ్రాసినా రాదని నేననుకుంటాను. ఈరోజు వాడుకలోకి వచ్చి అందరి నోళ్ళళ్ళో నానుతున్న పదాలు తెలుగు పదాలే కావలసిన అవసరం లేదు. ఏ భాష పదమైన కావచ్చు. ఏ భాషకు చెందని పదమూ కావచ్చు. ఒక వేళ అది తెలుగు పదం కాకపోతే, ప్రతి పదానికి ఖచ్చితంగా ఒక తెలుగు పదం ఉండి తీరాల్సిందే అని పంతానికి పోయి దొరికిన ప్రతి ఇంగ్లీష్/పరభాషా పదానికి ఒక సరిసమానమైన పదం వెతికి/సృష్టించి, వాడడం మొదలు పెట్టి అదే భాషోద్ధారణ అనుకోవడం నాకు బ్లాగుల్లో కనిపించింది.

ఈ పద సృష్టి ఎలా ఉందో ఒక్కసారి చూద్దాం. క్రింద పేర్కొన్న ఈ పదాలు నా సొంత కవిత్వం కాదు. నేను ఇక్కడ చూసిన, వాడుకలో ఉన్న కొన్ని పదాలను మాత్రమే ఇస్తున్నాను.

Net: జాలం
Internet: అంతర్జాలం
Mouse: ఎలుక, మూషికం
Computer: సంగణకం
Hard disc: దృడ పళ్ళెం.
Hardware: గట్టి సామాను.
Software: మెత్తటి సామాను
Credit card: ఋణ రేకు
Firefox: మంట నక్క
Open Source: బహిరంగాక
Browser: విహారిణి
Laptop: అంకోపరి
Download: దింపుకోవడం
Install: స్థాపించుకోవడం
Hits: నొక్కులు
Links: లంకెలు
Post, Comments, Cut, Copy, Paste etc...


మొదట ఈ పదాలు విని ఏదో కామెడికి ఇలా చేసారేమో అనుకున్నాను. కానీ తర్వాత తెలిసింది. భాషాసేవలో, పదసృష్టిలో ఇవి ఓ భాగమని. నలుగురితో నారాయణ అనుకుంటూ ఇందులోని కొన్ని పదాలు నేనూ వాడాను. కానీ ప్రతిసారీ అనిపించేది. ఇలా వాడడం అవసరమా అని.

మన గ్రంథసాంగులు అలమారా గూళ్ళలోని, ఇనప పెట్టెల్లోని నిఘంటువులకు దుమ్ముదులిపి పదానికి పదం కలిపి సగటు బ్లాగరుకు వెగటు పుట్టించేలా తయారు చేసిన/చేస్తున్న ఈ ఆర్భాట పదకోశం ఎంత మందికి ఉపయోగపడుతుంది. ఈ పదాల వెతుకులాటనే మనం చేసే భాషాసేవా? ఈ చిందరవందర గందరగోళం ఎందుకు?

Post ను తెలుగులో ఏమని పిలుద్దాం. జాబు? ఉత్తరం? లేఖ? టపా? అన్ని వాడదాం పోయేదేముంది అంటారా? రేపో గీర్వాణ శిరోమణి వచ్చి "మంట నక్క" అంటే మరీ తేలికగా ఉందని పదంలో weight లేదని "జ్వాలాజంబుకం" అని పాండిత్యం ప్రదర్శిస్తే అప్పుడు మళ్ళీ దాన్ని మోసుకొని తిరుగుదామా? మౌస్ చిన్నగా ఉంటే చుంచెలుక అని, పెద్దగా ఉంటే పందికొక్కు అని అనుకుందామా? "సంకనాకం" అనేది గజడదవాదేశ సంధి ప్రకారం సంగణకం అవుతుందన్నమాట... అని మరో భాషావేత్త వ్యాకరణ పాఠాలు చెప్పడని గ్యారంటి ఏమిటి?

ఇప్పుడు చేసిన ఈ ట్రాన్స్‌లేషన్‌లు కొంత కాలానికి రివర్స్ ట్రాన్స్‌లేషన్‌ కాకుండా పోవు. దీనికి సంబంధించి ఒక సంఘటన గుర్తుచేసుకుందాం. ఈ కథ నార్త్ చెన్నై పట్టణంలో ఉన్న బార్బర్స్ బ్రిడ్జ్ గురించి. మెదట దీనిపేరు Hamilton Bridge గా ఉండేదట. అయితే, దాన్ని పలకడానికి సులువుగా ఉంటుందని, ఇంగ్లీష్‌లో బాగాలేదు "తమిళీకరిస్తే" భేషుగ్గా ఉంటుందనుకొని కొందరు ఔత్సాహికులు Ambattan vaaravathi (Hamilton -> Ambattan అని Bridge -> vaaravathi) అని సగంసగం ట్రాన్స్‌లేషన్ చేసి ఒదిలి పెట్టారట. కానీ ఆ తర్వాత మొదలైంది అసలుకథ. తమిళంలో Ambattan అంటే మంగలి అని అర్థం. కొన్నిరోజుల తర్వాత కొందరు చదువుకున్న వాళ్ళు ఇంతమంచి బ్రిడ్జ్‌ని ఇలా తమిళంలో మంగలి పేరుతో పిల్చుకోవడం ఏంటి? అని నొచ్చుకొని మళ్ళీ దాన్ని ఇంగ్లీష్‌లోకి మార్చేసి Barber’s Bridge చేసేసారు. ఇలా భాషవేత్తల తలతిక్క తర్జుమాలా మూలంగా Hamilton Bridge కాస్తా Barber’s Bridge అయి కూర్చుంది. ఈ ప్రాప్తం కంప్యూటర్ భాషకు పట్టదన్న భరోసా లేదు.

Shakespeare అనేది Shake spear కు రూపాంతరం అని "కదిలే బరిసే" అని తెలుగీకరించి సంబరపడదాం (దీనిపై ఇంకా ఎక్కువ ఈకలు పీకితే బూతవుతుందేమో అని భయంగా ఉంది). అమెరికా మాజీ వైస్‌ప్రెసిడెంట్ Dick Cheney పేరును కూడా పదానికి పదం కలిపి కదం తొక్కిద్దాం (అది ఎలా తయారైనా మనకు సంబంధం లేదు).

ప్రస్తుతం మన బ్లాగుల్లో మాత్రం ఇంగ్లీష్‌ను వ్యతిరేకించడమే తెలుగు భాషను గౌరవించడం అన్నట్లు తయారయింది. వాడుక మాటలు వాడినంత మాత్రాన తెలుగు భాషకు తీరని ద్రోహం చేసినవారమైపోతామా? ఇక్కడ మనం భాషను భ్రష్టుపట్టించాలని ఈ పదాలు వాడడం లేదు. ఎదుటివారికి సులభంగా అర్థం అవుతుందన్న భావన తోనే వాడుతున్నాము కదా. అవసరమైనప్పుడు మిగతా భాషలను వాడుకుంటూ తెలుగును గౌరవించుకోలేమా?

పదనిర్మాణం తో పాండిత్యం చూపించడం వల్ల ఉపయోగం ఉందా? ఓ పది కొత్త పదాలు సృష్టించి, పదిమంది చేత వాటిని పలికించడమే తెలుగుకు మనం చేసే సేవా? కొత్తపదాలు పుట్టించడంలో తప్పేముంది... ఏమి లేదు, కానీ ఇలా పదానికి పదం కలిపి కొత్త పదాలు సృష్టించడం కంటే, మౌస్‌ను "సూచీ" అని హార్డ్‌డిస్క్‌ను "భండాగారం" అని ఇలా "సమభావ" పదాలు వాడుకోవచ్చు కదాని ఎక్కడో ఇంతకు ముందు చర్చలో చదివిన గుర్తు. అది కొంచెం అర్థవంతమైన వాదనలా అనిపించింది.

బ్లాగుల్లో ఉన్న భాషాభిమానులు మరొక్కసారి ఆలోచిస్తారనే అనుకుంటున్నాను. నేనెవరినీ ఇలా ఉండాలి అని చెప్పడం లేదు. ఎవరి క్రియేటివిటి వాళ్ళది. ఎవరు ఏ పదాన్నైన పుట్టించొచ్చు. వాడొచ్చు. నేనేమీ భాషోద్ధారకున్ని కాదు. పైన చెప్పిన పదలు ఎవరు వాడినా వాడకపోయినా నాకు వచ్చేదిలేదు, పోయేదిలేదు. కానీ పరయివాడు నోటికొచ్చినట్లు ఏది పలికినా మనం మక్కికి మక్కి పదాలు కలిపి చంకలుగుద్దుకొని సంబరపడిపోయే "భాషా బానిసత్వం" నుండి బయటపడే ప్రయత్నం ఎందుకు చేయొద్దనే అలోచన మాత్రమే.

36 comments:

శరత్ 'కాలమ్' said...

ఆ మధ్య కొన్ని బ్లాగుల్లో సరదాగా తెలంగాణా యాసలో కంప్యూటర్ పదాలు ఎలా వుంటాయో ఇచ్చారు. తెలుగు భాషతో పాటు మాండలికాలు పదాలు కూడా అభివృద్ధి చేయాలి అధ్యక్షా! ముఖ్యంగా తెలంగాణా వాదులు తెలంగాణా యాసలో తెలుగీకరణ కోసం కృషిచేయాలి. బ్లాగుల్లో కూడా ఆ పదాలు విరివిగా వాడాలని డిమాండ్ చేస్తున్నాం. అలాగే కోస్తా, ఆంధ్రా, రాయలసీమ మొదలయిన వారు కూడా ఇంగ్లీషు పదాలకు గాను ఆయా ప్రాంతీయ పదాలని ఉపయోగించాలని, తద్వారా తెలుగును ఉద్ధరించాలని మనవి చేసుకుంటున్నాను.

శ్రీనివాస్ said...

లేదు వాఖ్య ( no comment)

Anonymous said...

ప్రతి వ్యక్తీకరణకీ పరాయిభాషలమీద ఆధారపడడమే అసలైన బానిసత్వం, భావదారిద్ర్యం కూడా ! మాతృభాషాపదాల్నివాడ్డం భాషాభిమానం అవుతుంది. మన భాష మనం రోజూ మాట్లాడుకోవడం లాంటిదే మన పదాల్ని మనం కల్పించుకొని వాడ్డం కూడా !


ఇప్పుడు ఇంగ్లీషు పదాలకి సమార్థకాలుగా ప్రచారంలో ఉన్న తెలుగు పదాలు కూడా ఈ అర్థంలో మన పూర్వీకుల వాడుకలో లేవు. అవి కూడా పాత నిఘంటువుల లోంచి పునరుద్ధరించబడిన/ కల్పించబడిన/ మార్పు చేయబడిన పదజాలమే. ఉదాహరణకి :- ప్రభుత్వం, పాత్రికేయుడు, మదుపరి మొ|| ఇంగ్లీషులో ఉన్న కంప్యూటర్ పదజాలం కూడా గత పది-పదిహేనేళ్ళలోనే అభివృద్ధి చెందింది. అంతకుముందు లేదు. అదివఱకటి సాహిత్య/ వ్యావహారిక పదాల్నే కంప్య్యూటర్ సైన్సులో కొత్త అర్థాల్లో వాడ్దం మొదలుపెట్టారు. ఉదాహరణకి :- చిప్, బ్రౌజింగ్ మొ|| అయితే కొత్త పదాల్ని కల్పించడం పట్ల గానీ, కొత్త అర్థాల్ని కల్పించడం పట్ల గానీ మీకున్న ఎలర్జీ ఇంగ్లీషువాళ్ళకి లేదు. కాబట్టి వాళ్ళు వాటిని యాక్సెప్ట్ చేశారు. మీరు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు.

తెలుగుపదాలు ఎందుకు ? అనే ప్రశ్నవేసేవారు ఆ తరువాత అసలు తెలుగెందుకు ? అనే ప్రశ్న కూడా వేస్తారు. మనకి తెలుగు కావాలి అనుకున్నప్పుడు తెలుగు పదాలు కూడా కావాలి. మన దేశీయ పదాలు మన సృజనాత్మకతకి, స్వకీయతకీ (ఒరిజినాలిటీకి) నిదర్శనం. మన దేశీయ పదాల ద్వారానే మన భాష నిలబడుతుంది. దేశీయపదాలు మన భాష యొక్క మనుగడకి సమర్థన (justification) ని సమకూరుస్తాయి. లేకపోతే "మీ భాషలో ఉన్నవన్నీ మా పదాలే కదా ! ఆఫ్ట్రాల్ మీదీ ఒక భాషేనా ? " అని విదేశీయులు మనల్ని గేలి చేస్తారు. అదీ గాక దేశీయపదాలకి వివరణ ఇవ్వడం సులభం. పరాయిపదాలకి వివరణ ఇవ్వాలంటే ఆ పరాయిభాషావ్యాకరణాన్ని అందఱికీ నేర్పాలిసి వస్తుంది. అది చాలా కష్టం.

తెలుగుపదాలు వాడేవారు వాడతారు. వాడనివ్వండి. అందుగుఱించి మనకెందుకు బీపీ పెఱగాలి ? మనం ఇంగ్లీషు పదాలు వాడుతున్నామని తెలుగుభాషాభిమానులేమీ బీపీ పెంచుకోవడం లేదు కదా ? మీకు తెలియకపోవచ్చునేమో - హిందీ, మరాఠీ కన్నడ, తమిళ్ మొదలైన భాషలలో తెలుగు కంటే చాలా ఎక్కువ శాతంలో దేశీయపదాల్ని వాడతారు. మనమే ఆ విషయంలో కొంచెం తక్కువ.

Anonymous said...

ఇంగ్లీషు మాత్రమే ఎప్పటికప్పుడు కొత్తకొత్తపదాలతో అభివృద్ధి చెందాలనీ, తెలుగు మాత్రం ఇప్పటికే ఉన్న పదాలతో సంతృప్తి చెంది సరిపుచ్చుకోవాలనీ, ఇకముందు అంతా దిగుమతి సరుకుతో కాలం గడపాలనీ వాదించడమ్ అర్థరహితం, హాస్సాస్పదం కూడా. తన స్వంత శబ్దవనరులతో అభివృద్ధి చెందే హక్కు ప్రతిభాషకీ ఉంది. ప్రతిజాతికీ ఉంది. తెలుగుజాతిని ఒక స్వతంత్రజాతిగా చూద్దాం. తెలుగు భాషని ఒక స్వతంత్రభాషగా చూద్దాం.

వేమన said...

మొదలే అర్ధం లేని ఆంగ్ల పదాలకి మక్కీ కి మక్కీ తెలుగు పదాలు పుట్టించి దాన్ని భాషా సేవ అనడం అత్యుత్సాహం తప్ప మరోటి కాదు. 'మంట నక్క' ఓ మంచి ఉదాహరణ. దాని బదులు చరిత్రలో మరుగున పడిపోయిన, పోతున్న తెలుగు పదాలని వెలికి తీసి ఓ సారి గుర్తు చేసుకోగలిగితే చాలు.

మంచు.పల్లకీ said...

దిగువనుండి రెండొ పేరగ్రాఫ్

" కానీ ఇలా పదానికి పదం కలిపి కొత్త పదాలు సృష్టించడం కంటే, మౌస్‌ను "సూచీ" అని హార్డ్‌డిస్క్‌ను "భండాగారం" అని ఇలా "సమభావ" పదాలు వాడుకోవచ్చు కదాని ఎక్కడో ఇంతకు ముందు చర్చలో చదివిన గుర్తు. "

అంటే మీరు కొత్త పదాలకి వ్యతిరేఖం కాదు కానీ ఇలా మక్కీకి మక్కి అనువదించడమే బాలేదు అంటారా ?

నా అభిప్రాయం అదే.. అసలు కొత్త పదాలే పుట్టించడం తప్పనుకుంటే పొరబాటు..

ఇకపొతే ఇంగ్లిష్ డిక్షనరి లొ ప్రతిసంవత్సరం కొన్ని పదాలు చేరుస్తూంటారు కదా.. అవి ఇలా అనువదించరు.. ఉదాహరణకి చాయ్ .. పాలు కలిపిన టీ (ఇంక కొన్ని టీ మసలా) వాడటానికి చాయ్ అనే పదం డిక్షనరి కి ఆడ్ చేసారు కానీ 'మిల్క్‌టీ' 'క్రీంటీ' అనొ అనువదించి చేర్చలేదు .. అలాగే మనం కొన్న్ని ఇంగ్లీషు పదాలు వాడుకొవచ్చు .. అన్ని అర్జెంట్ గా తెలుగులొకి అనువదించక్కర్లేదు.. అలా అని కొత్త పదాలు పుట్టించడం తప్పుకాదు.. కాకపొతె వున్నపదాలనే కాపడుకొలేపొతున్న టైం లొ కొత్త పదాలు ఎందుకంటారా.. ఒకే ఒకే

మంటనక్క అన్నది సరదాగా అనువదించారెమో.. మీరు మరీ సీరియస్ గా తీసుకుంటున్నారనిపిస్తుంది.. :-) ఎవరి మీదో మీకు బాగా కసి వున్నట్టుంది .. :-))

ఏక లింగం said...

@ శరత్,
ఎవరైనా ప్రాంతీయ భాషా ఉధ్యమకారులు ఆ పని మొదలు పెడితే బాగుంటుంది. ఆ పని మీరే మొదలుపెట్టి తెలుగు భాషను తగురీతిలో ఎందుకు ఉద్ధరించకూడదు?

@ శ్రీనివాస్,
కృతజ్ఞతలు.

@ మొదటి అజ్ఞాత,
మీరు కొన్ని పదాలు ఇచ్చారు, ప్రభుత్వం, పాత్రికేయుడు.... ఇవి వేటికైనా పదానికి పదం కలిపి తయారు చేసినవా? లేక ఇంగ్లీష్ పదానికి సమానమైన్ అర్థం ఈ పదాలి ఇవ్వగలవని వాడుకలోకి తెచ్చినవా? తెలిపగలరు.

---
ిలేకపోతే "మీ భాషలో ఉన్నవన్నీ మా పదాలే కదా ! ఆఫ్ట్రాల్ మీదీ ఒక భాషేనా ? " అని విదేశీయులు మనల్ని గేలి చేస్తారు.
---
నిజమా? ఇంగ్లీష్‌లో కొన్ని వేలకొద్ది పరభాషా పదాలి ఉన్నాయి. వాటిని చూపించి ఎన్నిసార్లు గేలి చేసారు? పోనీ తెలుగులో నాటుకుపోయిన పరభాష పదాలను ఎంత మంది గేలి చేసారు?

ఇహ నాకు బిపి పెరగడం అంటూ ఏమీ లేదు లేండి. మాకిదంతా ఓ వీకెండ్ సంబరం అంతే :-)

@ అజ్ఞాత,
ఔను తెలుగు భాషను కాపాడుదాం. కొత్తపదాలు సృష్టిద్దాం. భాషోద్దరణలో భాగంగా, నావంతు వాటాకింద కొన్ని పదాలు తయారు చేద్దాం అనుకుంటున్నాను. ఆ ప్రక్రియ పూర్తికాగానే అన్నీ కలిపి బ్లాగుల్లోకి వదులుతాను. వాటికి మీలాంటి వాళ్ళ సహాయం తప్పకుండా కావాలి.

ఏక లింగం said...

@ వేమన,
కొత్త పదాలను సృష్టించి, వాటిని నెత్తినేసుకుని తిరుగుతున్న వీళ్ళ వాలకం,
"మూల విరాట్ ముష్టెత్తుకుంటుంటే, ఉత్సవ విగ్రహాన్ని ఊరేగింపుకు తీసుకెళ్ళినట్లు" ఉంది. ఎవరి సంతోషం వాళ్ళది లేండి. కాదనడానికి మనమెవరం?

@ మంచు,
ఆ వాదన కొంచెం అర్థవంతంగా అనిపించింది అన్నాను కాని, అలగే ఉండాలి అని అనలేదు కదా?

ఇక ఇంగ్లీష్ భాషలోకి ప్రతి సంవత్సరం కొన్ని కొత్త పదాలు వచ్చి కలుస్తున్నాయి అన్నారు. అందులో ఎన్నింటిని ఇంగ్లీష్‌లోకి అనువాదం చేసి కలుపుకుంటునారు? ఎన్నింటిని అలాగే వాడుకుంటున్నారు? (నాకు తెలిసినంతలో ప్రతి పరభాష పదాన్ని అలాగే కలుపుకుంటున్నారనుకుంటాను)

మంటనక్క అన్నపదం కొంచెం ఫన్నీగా ఉందని అందరూ దాన్ని ఎత్తిచూపుతున్నారు తప్ప ఎవరిపైనో కసితో కాదు. మీరు లేనిపోని అనుమానాలు కలిగించకండి :)

సుజాత said...

నేను భాషాభిమానినే గానీ అర్థం పర్థం లేని తెలుగు అనువాదాలకు శుద్ధ వ్యతిరేకిని!అనువాదం సరళంగా ఉండాలి.అందరికీ అర్థం అయ్యేలా ఉండాలి.నవ్వు తెప్పించకూడదు.అప్పుడు మాతృభాషనే గేలి చేసినవాళ్లమవుతాము.ఈ మాటంటే "తెలుగు భాషను మీ తాతే పుట్టించాడా ఇలా ఉండాలని"అని హేళంగా మాట్లాడిన వాళ్ళున్నారు కూడా!

మంటనక్క అనే మాట సరైన తెలుగు అనువాదమా?

గట్టిపళ్ళెం?సంగణకం?మృదుసామాను?...ఇవన్నీ మనం బతికుండగా(పోయాకైనా సరే)వాడుకలోకి వస్తాయా?

అసలే అంతంత మాత్రంగా ఉన్న తెలుగును ఇలాంటి ముక్కస్య ముక్క అనువాద పదాలతో నింపడం భాషను సుసంపన్నం చేయడం ఎంత మాత్రం కాదు.

ఇలా పదానికి పదం కలిపి కొత్త పదాలు సృష్టించడం కంటే, మౌస్‌ను "సూచీ" అని హార్డ్‌డిస్క్‌ను "భండాగారం" అని ఇలా "సమభావ" పదాలు వాడుకోవచ్చు కదాని ఎక్కడో ఇంతకు ముందు చర్చలో చదివిన గుర్తు. అది కొంచెం అర్థవంతమైన వాదనలా అనిపించింది. ......makes sense!

భాస్కర్ రామరాజు said...

మంటనక్క కేవలం ఫన్ కోసం.
మౌస్ అనేదాన్ని తెలుగులో ఎలుక అనటం ఏ మాత్రం సరిపోదు. ఆంగ్లంలో మౌస్ అన్నంత మాత్రాన తెలుగులో ఎలక అంటం కేవలం హాస్యానికే అన్నట్టుగా ఉంది.
నామటుకు నాకు, పరాయి భాషలు నేర్చుకోవడంతో, ఆ భాషలు మన పరిభాషలు కావటంతో, ఆ భాషాణుగుణంగా మనల్ని మనం మాతృభాషలోకి చూస్తున్నాం. దానివల్ల నేటివిటీ పోయి ఇలా తయ్యారౌతోంది.
తెలుగు మీడియంలో చదివిన నా బోటిగాళ్ళకి తెలుగు భాషలో అర్రే ఈ పదంలేదే అని ఓ పెద్ద తల బద్దలు పెద్దగా కొట్టుకోలేదు. ఉన్న పదాలు అన్నీ మనం వాడినప్పుడే కదా, మనకి సరిపోను పదాలు ఉన్నాయోలేవో తెలిసేది..ఈడ్చి తంతే మనకి ఓ వెయ్యి పదాలు తెలుసేమో.

ప్రసాదం said...

ఇలాంటి పదాల సృష్టి వల్ల భాష అభివృద్ధి అవుతుందో లేదో గానీ, నా అభిప్రాయం ఏమంటే...

ముందుగా ఆంధ్రప్రదేశ్ లోని అన్ని పాఠశాలల్లో 5 లేదా 7 వ తరగతి వరకు నిర్బంధంగా తెలుగు మాధ్యమం పెట్టాలి. దీనివల్ల భాష సజీవంగా ఉండగలుగుతుంది. ఆంగ్ల మాధ్యమంలో పిల్లలకు తెలుగు అనేది గణితం కంటే కష్టం అయి కూర్చుంది. వాళ్ళు తెలుగు పాస్ అయితే చాలురా దేవుడా అనే పరిస్థితి. అంతే కానీ తెలుగులోని తియ్యదనాన్ని ఆస్వాదించడం లేదు. కథలు పుస్తకాలు చదివే అవకాశం లేకుండా పోతోంది. ఇలా వారు కనీస విలువలు, లోకఙ్ఞానం, మానవత్వం లాంటివి తెలుసుకోలేకపోతున్నారు.

తెలుగు మీడియం వల్ల విషయం నేరుగా విద్యార్థి బుర్ర లోకి ఎక్కుతుంది. బట్టీ పట్టాల్సిన అవసరం లేదు, ఒత్తిడి ఉండదు. భాషపైన మమకారం చిన్న వయసులోనే మనసుపై ఒక ముద్ర వేస్తుంది. పుట్టినప్పట్నుంచి పాలతో పాటు ఇంగ్లీషును మింగుతూ వచ్చిన పిల్లలు తర్వాతి తరంలో తెలుగును కాపాడాలి అన్నది ఎంత హాస్యాస్పదం?

ఇలా తెలుగు మీడియం వల్ల బహుముఖ ప్రయోజనాలున్నాయి. నిజానికి ఇది కుంభస్థలం మీద కొట్టడం లాంటిది.

మాతృ భాషకు దినాలు తద్దినాలు పెట్టి పండుగలు చేయడం, ఎవడికీ అర్థం కాని అచ్చ తెలుగు అంకెలు రాయడం లాంటి చర్యల వల్ల భాష నిలుస్తుందనుకోవడం... నాకైతే నమ్మకం లేదు.

మాతృ భాష ఇంటి భాష గురించి రోజూ వ్యాసాలు రాసిన రామయ్య గారు, ఎన్నికైన ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు ఈ విషయంపై కనీసం ఒక్కసారైనా సభలో మాట్లాడారో లేదో తెలీదు.

చివరగా... ఎవరు ఎలాంటి చర్యలు చేపట్టినా మన అందరిలో ఒక కామన్ పాయింట్ ఉంది. అది తెలుగు భాష సజీవంగా ఉండాలి అన్నది. ఇలా ఎవరికీ తెలిసే అవకాశం లేని తెలుగు పరిరక్షణ ఉద్యమాల వల్ల జరిగేది శూన్యం. ఒక పెద్ద ఉద్యమం రావాలి. స్కూళ్ళలో తెలుగు మీడియం రావాలి. అదొక్కటే పరిష్కారం అని నా అభిప్రాయం.

Anonymous said...

భాషాసేవలో...
కర్రెక్ట్ గా చెప్పారండీ
పదాలను మక్కీ కి మక్కీ అనువదించి తెలుగు బాష ని ఎక్కడికో తీసుకేల్లిపోతున్నాము అనే ఫీలింగ్ లో ఉన్నారు చూడండీ దానినే వ్యతిరేకిస్తున్నాను
అందరికీ అందుబాటులో ఉండేలా సౌలభ్యం మరియు ఈజీ గా వుంటే చాలు అని చెప్పిన మీ అభిప్రాయం తో ఏకీభవిస్తున్నా

Anonymous said...

ఒక ఉదాహరణ
తప్పుగా అనుకోకపొతే
మీరు మరియమ్మ ని పూజిస్తున్నారు అనుకోండి
దాన్ని తెలుగీకరించి and అమ్మ ని చేసేస్తారా?
ఎండమ్మ భక్తులం అని చెప్పుకుంటారా

ఎండమ్మ,నీడమ్మ,కలర్ లీడరమ్మ
ఇలా అడ్డూ అదుపూ లేకుండా వాడేస్తారా

శ్రీనివాస్ గారి అనుమతి లేకుండా లీడరమ్మ అని రాసినందుకు సారీలు

శ్రీనివాస్ said...

@ above Anonymous

కలర్ లీడరమ్మ పదం మీద పేటెంటు ఏమీ లేదు లెండి . సింగిల్ లింగం గారు మంచి చర్చకి తెర తీశారు. సింగిల్ మాత్రమె అనువదించడానికి బలమైన కారణం ఉంది.

ఏక లింగం said...

@ సుజాత,
--
"తెలుగు భాషను మీ తాతే పుట్టించాడా ఇలా ఉండాలని"అని హేళంగా మాట్లాడిన వాళ్ళున్నారు కూడా!
--
నాకొచ్చిన తిట్లతో పోల్చుకుంటే అది చాలా మేలు లేండి. కొందరు నుండి నన్ను బండబూతులు తిడుతూ వచ్చిన కామెంట్స్ ఇక్కడ పెట్టడంలేదు.

మరికొందరు, మా ఇష్టం వచ్చిన పదాలు పుట్టిస్తాం. అడగడానికి నువ్వెవరు? నచ్చినవాళ్ళు వాడుకుంటారు నచ్చని వాళ్ళు లేదు. అని చాలా మర్యాదగా చెప్పారు.

ఇంకొంతమంది, "ప్రతి ఒక్కడికి అలుసైపోతుంది తెలుగు భాషంటే" అని వాపోయారు. అది చూసిన తర్వాత నిజమే కదా తెలుగు భాషంటే ప్రతి ఒక్కరికి అలుసై పొతుంది. బ్లాగులు రాసుకునే నేను భాష గురించి మాట్లాడడమేంటని జ్ఞానోదయం అయింది.

@ భాస్కర్ రామరాజు,
Agreed.

@ ప్రసాదం,
మీ అభిప్రాయానికి కృతజ్ఞతలు. మీరు టీచరు కాబట్టి పాఠశాల విద్య గురించి చెప్పగలిగారు. పాఠశాలల్లో తెలుగు భవిష్యత్తు అనేది దానికోసమే పనిచేస్తున్న భాషావేత్తలు, నిర్ణయాదికారుల దయ. ఇక, ఉన్న తెలుగును కాపాడుకుందాం అన్న మీ అభిప్రాయంతో ఏకీభవిస్తున్నాను.

@ అజ్ఞాతలు,
కృతజ్ఞతలు.

@ శ్రీనివాస్,
అహా... నాపేరుకే "ఎసర్లు" పెడుతున్నవా?

శ్రీనివాస్ said...

బూతులు ప్రచురించాల్సింది ... ఆ వర్గం వారి రెండో రూపం అందరికీ తెలిసేది.

ఏక లింగం said...

అధికారంలో ఉన్న రాజకీయ నాయకునికి ఏంజరిగినా "ప్రతిపక్షాల కుట్ర" అన్నట్లు...మనకు వ్యతిరేకంగా ఎవరు రాసినా "ఆ వర్గం" అనుకోవడం సరికాదేమో?

సందు దొరికితే నాకు దుప్పటి కప్పాలని చూసేవాళ్ళు ఇక్కడ చాల మంది ఉన్నారు. అందులో ఎవరైనా కావచ్చు కదా? :)

శ్రీనివాస్ said...

సందు దొరికితే నాకు దుప్పటి కప్పాలని చూసేవాళ్ళు ఇక్కడ చాల మంది ఉన్నారు.

__________________________________________________

నాక్కూడా ముసుగు వెయ్యడానికి ఒక బ్యాచ్ రెడీ అయింది అని ఈ మధ్యనే తెల్సుకున్నా ... పోన్లే ప్రతి అజ్ఞాత కి ఒక రోజు వస్తుంది అని ఊరుకున్నా

కత్తి మహేష్ కుమార్ said...

http://parnashaala.blogspot.com/2009/11/blog-post_05.html
http://parnashaala.blogspot.com/2009/06/blog-post_30.html
http://parnashaala.blogspot.com/2009/07/blog-post_05.html

RaaJ said...

కొత్త పదాలను సృష్టించి, వాటిని నెత్తినేసుకుని తిరుగుతున్న వీళ్ళ వాలకం,
"మూల విరాట్ ముష్టెత్తుకుంటుంటే, ఉత్సవ విగ్రహాన్ని ఊరేగింపుకు తీసుకెళ్ళినట్లు" ఉంది.
____________________________
సామెత భలే కుదిరింది. చప్పట్లు.

krishna said...

మీ అవేదన అర్ధవంతం.తెలుగు భాష మీద అభిమానం విషయంలో అందరికీ ఏకాభిప్రాయం వుంది కదా! సంతోషం :-) .
ప్రయత్నం అందరూ చేస్తున్నారు. కొన్ని బాగున్నాయి, కొన్ని అంత బాగాలేవు. ఇది సరి కాదేమో అన్న మాత్రాన భాష మా బావ కనిపెట్టాడు, మతం మా మామ కనిపెట్టాడు నువ్వు ఎవడివి మమ్మలని తప్పు అనడానికి అని వ్యక్తిగత దాడులకి దిగే మూర్ఖులు ఎక్కడన్నా వుంటారు. ఒక్కోసారి ఉపేక్షించాలి, ఒక్కోసారి ఎదురుదాడి చెయ్యాలి. భాష పై మంచుగారు, సుజాత గారు, భారారె గారు, ప్రసాదం గారు సూచనలు బాగున్నాయి.

మంచు.పల్లకీ said...

@ 1లింగం : నేను కాస్త సంఖ్యాబిమాని లెండి :-)
@ 1లింగం, శ్రీనివాస్ : సందు దొరికితే ముసుగెసెయ్యాలనుకునేది శరత్ గారికి కదా... మీకూ వున్నారా ఆ అభిమానులు..
@ కృష్ణ : భారారే , భారారా వేరు వేరు.. :-)

మంచు.పల్లకీ said...

ముందే చెబుతున్నా
Mr snow palanquin
అన్న అనువాదం మా ప్రవీణన్న పేటెంట్.. మీరు ఇంక నా పేరు ఖూనీ చేయ్యకర్లేదు ...:-))

ఏక లింగం said...

@ కత్తి మహేష్ కుమార్,
మీరు రాసినవి చదివానండి. ఇక్కడ నేను బ్లాగు భాష గురించి మాట్లాడుతున్నాను కానట్టి మిగతా వాటి గురించి మాట్లాడం లేదు. నాకంత అర్హతా లేదు.
---
ఒకసారి పల్లెల్లొకిబోయి సూడండి సామీ బాస దర్జాగా బతికిపోతావుండాది. సచ్చింది సస్తావుండేదీ “ఇది సరైన భాష” అని చెప్పిచచ్చిన భాష. అది ఉన్న్యా పోయినా ఒగటే.
---
ఇది నిజం. అనవసరమైన పదాలు సృష్టించి పనిగట్టుకొని ప్రచారం చేయడం ఏమాత్రం అవసరం లేదన్నది నా అభిప్రాయం.


@ Raaj
థాంక్స్.

@ krishna,
నాకంటు ఏ ఆవేదన లేదు. కేవలం అభిప్రాయం మాత్రమే. ఏ భాషేలాపోయినా నేనున్నంత కాలం నాభాష ఎప్పుడూ నాతోనే ఉంటుంది. దానికి ఎటువంటి ప్రాబ్లం లేదు.

@ మంచు,
ఏదో మొహమాటానికి బయటకు కనబడకపోయినా, ముసుగేయడానికి రెడీగా చాలా మందే కాసుకు కూర్చున్నారిక్కడ.

నేను కూడా సంఖ్యాభిమానినే.
బ్లాగుల్లో మనలాంటి సంఖ్యాభిమానులంతా కలిసి కొత్త సంఖ్యా పదాలు సృష్టించి వాడుకలోకి తెద్దాం. వాడుకునే వాళ్ళు వాడుకుంటారు. అందులో ఎవరికీ ఏ అభ్యంతరం ఉండదనే అనుకుందాం.

ప౧ (పవన్)
చిం౨ (చింటు)
గాయ౩ (గాయత్రి)
గంగో౩ (గంగోత్రి)
వగైరా...

ఇలా కొత్త పదాలు సృష్టించి సంఖ్యాభిమానులు వాళ్ళవాళ్ళ అభిమానం ప్రదర్శించుకుంటే బాగుంటుందేమో. ఇలా చేయడం వలన తెలుగు/ఇంగ్లీష్ సంఖ్యలను బ్లాగుల్లోకి ఏక కాలంలో సులభంగా తీసుకుపోవచ్చు. ఇక మీదే ఆలస్యం. :)

Malakpet Rowdy said...

Scratch! Scratch!!

కలర్ లీడరమ్మ కాదు, విష్ణు లీడరమ్మ అనాలేమో?

Hehehehehhehehe .. లగెత్తరో మలకూ :))

Anonymous said...

ఈ కలర్ లీడరమ్మ, విష్ణు లీడరమ్మ, ఇస్టోరి ఏంది?
(అనవసరంగా కదిలించానా?)

శ్రీనివాస్ said...

మురళీమోహన్ = ఫ్లూట్ మోహన్
చంద్ర మోహన్ = మూన్ మోహన్
అన్న పూర్ణ = రైస్ పూర్ణ

రంగనాద్ = కలర్ నాద్
ధూళిపాళ = డస్ట్ పాళ

ఏక లింగం said...

అద్భుతం...శ్రీనివాస్. అద్భుతం. చాలా చక్కగా అను"వధించారు". తెంగ్లీష్ భాషకు మీరు చేస్తున్న సేవలు శ్లాఘనీయం. తరతరల వరకు బ్లాగ్‌లోకం మిమ్మల్ని గుర్తుంచుకుంటుంది. మీరిలాగే మీ సృజనాత్మకతకు పదునుపెట్టి మరుగున పడిపోతున్న తెంగ్లీష్ భాషకు కొత్త ఊపిరిలూదాలి. అందుకు ముందడుగు మీతోనే పడాలి. ఎంతో మంది నవ బ్లాగర్లకు మీరు మార్గదర్శకం కావాలి.

sowmya said...

ఎవరూ పుట్టించకపోతే పదాలు ఎలా పుడతాయి. కానీ పదాలను మక్కి కి మక్కీ అనువదించడం భాషాభిమానం అనిపించుకోదు. ఇలాంటి అర్థంలేని, ఏవగింపు కలిగించేపదాలు పుట్టించడం వలన తెలుగు భాషకి మనం చేసిన మేలు ఏమీ లేదు. మీరన్నట్టు ఆ ఆర్థం వచ్చేలాగ కనిపెట్టగలిగితే బావుంటుంది. అసలు మనకి ఇప్పటివరకు ఉన్న పదాలనే వాడట్లేదు. మన మంచి తెలుగు పదాలను వెలికితీసి వాటిని రోజువరీ సంభాషణలలో వాడుకుంటూ, అర్థవంతమైన సరికొత్త పదాలను కనిపెట్టడం ఉత్తమం.

మనం మరచిన మన తెలుగు పదాల గురించి ఒక పోస్ట్ రాసాను ఇదివరలో
http://vivaha-bhojanambu.blogspot.com/2010/05/blog-post_05.html

Malakpet Rowdy said...

Sreenivas

Ranga aint Rangu.

సుజాత said...

హోరి దేవుడా, రంగనాయకమ్మ గారికి అనువాదమా ఈ లీడరమ్మ? :-))

కోడీహళ్ళి మురళీ మోహన్ said...

1లింగం, మంచుపల్లకీ తదితర సంఖ్యాభిమానులారా!
ఈ టపాపై ఓ లుక్కేయండి :)
http://turupumukka.blogspot.com/2009/01/blog-post_13.html

శ్రీనివాస్ said...

అలాగే హెన్ హళ్లి ఫ్లూట్ మోహన్ గారు :))

Malakpet Rowdy said...

Kodi Halli Murali Mohan - హెన్ విలేజ్ ఫ్లూట్ ఎన్ చాంటర్

Wit Real said...

భాషా పరిణామ క్రమంలో, పరభాషా పదాలు ఆదేశాలుగా, ఆగమాలుగా వచ్చి చేరుతాయి. (అని చదువుకున్నట్టు గుర్తు)

కాబట్టి మనం ఎంత గింజుకున్నా, కంప్యూటర్ (ఆదేశం) లాంటి పదాలు తెలుగు భాషలో భాగం అయిపొ(యా/తా)యి

ఇక మనం మరచిన మన తెలుగు పదాల పట్టిక, కేవలం academic interest ki మాత్రమే ఉపయొగపడుతుంది తప్ప, భాషా పున్రుద్ధరనకి కాదని నా అభిప్రాయం

Anil Kumar Ramisetty said...

basha gurinchi blog lo intha ragada jarugutundaa. good ithe naa avasaram ikkada ledanamaata.

basha meda peddagaa pattinpu leni vaariki imaginations nni istapade vaariki kalallo viharisthunde naalaanti vaariki ilanti nijaalu anta mingudu padavemo