Thursday, 3 June 2010

నేన్నేర్చుకున్న బ్లాగు పాఠాలు: బ్లాగు భాష

సుమారు రెండు సంవత్సరాలకు ముందు, బ్లాగులు చదవడం మొదలు పెట్టినప్పుడు బ్లాగులోకపు ఆచార వ్యవహారాలు అన్నీ కొత్తగా అనిపించేవి. లోకంలో ఎక్కడేం జరిగిన ఇక్కడ బ్లాగుల్లో చర్చించుకోవడం, ఒకరినొకరు ప్రోత్సహించుకోవడం, వీలైతే అప్పుడప్పుడు పోట్లాడుకోవడం... ఇవన్నీ చూసి అర్రే, ఇప్పటికే మనం చాలా మిస్సయ్యాం కదా అనిపించింది. వీటన్నింటిలో వింతగా అనిపించింది మాత్రం ఇక్కడి భాష. బ్లాగులు చదవడం అలవాటు లేని నాకు ఇక్కడ భాష కొంచెం తేడాగా కనబడింది/కనబడుతుంది.

టపాలు, స్పందనలు, వ్యాఖ్యలు, లంకెలు, నొక్కులు, అంకోపరి, మూషికం, కవిలే, కైఫీయతు, ప్రవరా, జాలం, అంతర్జాలం, విహారిణి, బహిరంగాకర, సంగణకం, చిరునామా పెట్టె, స్థాపించుకోవడం, ముఖ పత్రం, దింపుకోవడం, వేగు పదం, నెనర్లు..... నా బొంద... నా బొచ్చె.


నేను కూడా బ్లాగు వ్రాయడం మొదలు పెట్టాలనుకున్నప్పుడు ఇలా వ్రాస్తేనే తెలుగులో వ్రాసినట్టేమో, లేక పోతే లేదేమో అని భయంగా ఉండేది. ఇందులో కొన్ని వాడుకలో లేని పాత పదాలైతే మరికొన్ని మాత్రం ఇప్పుడే పుట్టించిన సరికొత్త పదాలు. ఈ పాత పదాల్లో కొన్నింటిని అప్పుడో ఇప్పుడో చదివాను, కొత్త పదాల్లో కొన్నింటిని కొంచెం కష్టపడి అర్థం చేసుకున్నాను. అయితే వీటన్నింటిలో ఎక్కువగా తికమక పెట్టింది.. "నెనర్లు".

పెసర్లు, బొబ్బర్లు, కామెర్లు, గోమార్లు ఈ పదాలు విన్నాను. నెనరు లేని పుట్టుక, నెనరు లేని బ్రతుకు... ఇలాంటి తిట్లు తెలంగాణాలో చాలా సార్లు విన్నాను. కానీ నెనర్లు అని ఎక్కడా వినలేదు. తర్వాత తర్వాత నా మట్టిబుర్రకు తెలిసిందేమిటంటే ఇది ఇక్కడ బ్లాగు భాషా పండితుల పైత్యం వలన పుట్టుకొచ్చిన పదమని. ఇంతకుముందు ఎక్కడా లేదని.

ఇలా ఎవరైనా గట్టిగా అన్నారనుకో వాళ్ళ పైకి మన బ్లాగు భాషా పరిరక్షకులు గయ్యిమని ఇంతెత్తున లేచి, ఓ పాత తాళపత్ర గ్రంథం దుమ్ము మన మోహన దులుపి, మనకు అర్థంగాని పద్యం ఒకటి దరువెత్తుకొని, మన చెవులు అదిరిపోయేలా రాగందీసి, విన్నావా అహ..విన్నావా ఇది...మన శాస్త్రాలు ఏమని ఘోషిస్తున్నాయో... నెనరు అంటే కృతజ్ఞత, కాబట్టి నెనర్లు అంటే కృతజ్ఞతలు అని మనకో తెలుగు పాఠం చెప్తారు.

అయ్యా, కొన్నింటికి బహువచనాలు ఉండవేమో? నా విశ్వాసం అంటాం కానీ, నా విశ్వాసంలు అనం కాదా? అని పొరపాటున మీరేమైన అన్నారే అనుకో, ఛత్...నీకేం తెలుసు? నే పట్టిన ఉడతకు మూడే కాళ్ళు అని బిర్రబిగుసుకు కూర్చుంటారు.

అంతటితో ఊరుకుంటారా అంటే...అదీ లేదు. ప్రొద్దున్నే అడ్డమీద కూర్చొని, కనబడ్డ ప్రతి బ్లాగుకు వెళ్ళి, వీళ్ళ పైత్యం ప్రదర్శించి, ఇలాంటివి ఓ రెండు మూడు పదాలు వాళ్ళ బ్లాగులో అతికిస్తారు. వీళ్ళతో మనకెందుకని మిగతా బ్లాగర్లంతా ఈ "అచ్చతెలుగు పదాలను" ఊరంతా తిరిగి పళ్ళో అని అమ్ముకొని వస్తారు. ఇంకేం ఉంది. కొన్ని రోజులకు ఇవే ప్రామాణిక పదాలయి బ్లాగుల్లో రాజ్యమేలుతయి.


"బ్లాగు"ను "తెలుగీకరించలేరు" కాబట్టి కిక్కురుమనకుండా అలాగే వాడుతున్నారు. లేకుంటే దాన్ని కూడా ఓ ఆటడుకునే వాళ్లేమో అనిపించింది.

ఈ పదాలేమైనా ప్రింట్ మీడియాలో కనబడతాయా ఆంటే, అప్పుడో ఇప్పుడో వీళ్ళు వ్రాసిన ఆర్టికల్స్ బ్రతిమిలాడి బల్మీటికి ప్రచురించుకున్న దాంట్లో తప్ప ఎక్కడా కనబడవు. పోనీ ఈ తామరతంపర ఒకాబులరినీ వీళ్ళ బయట ప్రపంచంలో వాడుతారా అంటే అదీ లేదు. బయటకోస్తే అంతా పాష్ ఇంగ్లీష్. వీళ్ళకూ తెలుసు బ్లాగుల్ల్లో రాసే పదాలు బయట వాడితే వీళ్ళను పిచ్చోళ్లల చూస్తారని. మరి ఈ పదాలు ఎందుకయ్యా అంటే, బ్లాగుల్లో తమ పాండిత్యం ప్రదర్శించుకోడానికని నాకు తర్వాత తలకెక్కింది.

ఈ పిచ్చికి నవ్వుకుని మొన్నో తెలుగు పేపర్లో అంతర్జాలం అంటే మార్జాలంలా ఉందని దెప్పి పొడిచారు కూడా. అయినా బ్లాగుల్లో బ్రతుకుతున్న మనకు ఈ ఈసడింపులు, దెప్పిపొడుపులు కొత్తా చెప్పండి. భాషను ఉద్ధరించడానికి పూనుకున్న తర్వాత ఇవన్నీ పట్టించుకోవద్దు.

నేను కూడ తెలుగు భాషను రక్షించడానికి కృషిచేద్దాం అని డిసైడ్ అయొపోయా. మీరు కూడా తలా ఓ చెయ్యేంయ్యండి. భాషోద్దరణలో భాగంగా కొత్త పదాలను సృష్టిద్దాం. దుమ్ముపట్టుకు పోయిన పదలను మళ్ళీ వెలుగులోకి తెద్దాం. పదం ఎంత పాతదైతే మన పాండిత్యం అంత గొప్పగా కనబడుతుంది. ఈ కొత్త పదాలు ఎవరు వాడుతారు అన్న సంశయం మీకొద్దు. ఓ పది బ్లాగులు తిరిగి ఇరవై సార్లు అతికించి వస్తే చచ్చినట్లు వాళ్ళే వాడడం మొదలు పెడతారు. ఏమంటారు?

బ్లాగు లోకంలో ఎప్పుడు కొత్తపదాలు పుడుతాయో, ఎప్పుడు కొత్త ఆచారాలు మొదలైతాయో ఎవరూ చెప్పలేరు. అంచేత... రోజు మూషిక వాహనం ఎక్కి (అనగా మౌస్ చేతబట్టుకొని... అని కవి హృదయం) "అంతర్జాలంలో", "విశ్వవ్యాప్త వలయంలో" ఏడేడు లోకాలు తిరిగొచ్చే సంగణకనాథులమైన మనం గణనాథునికి ఎందులోను తీసిపోము. అంతేకాదు, ఓ మూడు సార్లు భూమిచుట్టూ తిరగరావడానికే బద్దకించి తల్లిదండ్రులకు ప్రదక్షిణ చేసి పనైయిందనిపించుకున్న గణపతికంటే మనమే ఓ మెట్టు పైనున్నాము. కాబట్టి కంప్యూటర్ వాడుకదార్లమంతా ఓ తొండం కూడా పెట్టుకొని తిరిగితే బాగుంటుందేమో అని ఎవరైనా విజ్ఞులు ఓ లాజికల్ పాయింట్ తీసుకొని రాగలరు. కావున దానికి కూడా సిద్ధంగా ఉందాం.

-ఏకలింగం

58 comments:

Anonymous said...

పురికాసు మొలతాడు లా వీరతాడు అని మొదలుపెట్టిన ఘనత ను మరిచిపోయారు
వీరతాళ్ళు అనే పదాన్ని మిస్ చేసారు :(
దాని పాపులర్ చేసిన పాపం ఎవరిదీ? ఎవరిదీ??
మన తెలు బ్లాగార్లదే :)

కన్నగాడు said...

funny, నెనర్లు అనే పదం నాకెందుకో వాడబుద్ది కాదు. ఎలాగు దానికి సరిపోయే పదాలు ఓ రెండు మూడున్నాయి కదా మళ్లీ ఉందో లేదో తెలీని పదం ఎందుకులే వాడడం అని వాడను. టపా అనే మాట కంటే లేఖ అనే పదం సముచుతమేమో(నేను కూడా పలుసార్లు 'టపా' వాడాను), మళ్ళీ లేఖ అంటే ఉత్తరమోయ్ అని అంటారేమో 'పోస్ట్' అంటే ఉత్తరమే కదా.

హరి దోర్నాల said...

బాగా వ్రాసారు.

తెలంగాణలో నెనరు అంటే పధ్ధతి అనే అర్థంలో వాడతారు.

అంతర్జాలం అనే పదం చదివినప్పుడల్లా 'పిల్లి అంటే మార్జాలం' సామెత గుర్తొస్తుంది.

పొద్దున్న మా అమ్మాయి 'ఈ రోజు ఉష్ణోగ్రత ఎంత డాడీ?' అంటే (ఈనాడు పేపర్ నాలెడ్జి) నాకు వెంటనే అర్థం కాలేదు. ఇలా చాలా ఉన్నాయి తెలుగులో కేవలం వ్రాత లోనే వాడే పదాలు.

శంభులింగం said...

ఇన్నాళ్ళూ ఈ ఏకలింగం ఎవరు? అనుకునేవాణ్ణి. ఓకేక, ఈ టపాను బట్టి ఆలోచిస్తే మీరు ఎవరో అర్థం అయింది. నా ఊహ కరెక్టేనా?

sowmya said...

నాకూ ఈ నెనర్లు చాలా కొత్తగా నైపించిందండీ. మొదట్లో అస్సలు వాడేదాన్ని కాదు, ధన్యవాదాలు, కృతఙ్ఞతలు అనే చెప్పేదాన్ని. కానీ కొందరు పండితులు దానికర్థం ఉందని మంచి తెలుగుపదమని చెప్పడంతో ఈ మధ్యనే వాడడం మొదలెట్టాను, ఇదిగో ఇహ ఆపేస్తాను. మీరు ఈ పోస్ట్ వేసి మంచి పని చేసారు.

అంతర్జాలం విన్నప్పుడు నాకూ మార్జాలమే గుర్తుకొచ్చింది. ఇంక నాకు అత్యంత నవ్వు తెప్పించిన పదమేమిటంటే "మంటనక్క" అదేనండీ ఫైర్ ఫాక్స్. దాన్ని మంటనక్క అని తెలుగీకరించారు, చచ్చాను నవ్వలేక.

Anonymous said...

Good One, I agree

jeevani said...

చాలా రోజుల్నుంచి మాసిపోయిన బట్టల్ను ఒక్కసారిగా చాకిరేవుకు వేసినట్టు ఉన్నారు :) నిజానికి నాక్కూడా నెనర్లు అనే పదం ఎందుకో ఇబ్బందిగా అనిపిస్తుంది. పాపం అది నెనర్లు చేసుకున్న దురదృష్టమేమో.

నాగేస్రావ్ said...

ఏకలింగం గారూ, ముందుగా మీకు మేలిపొద్దులు.
నేనూ బ్లాగ్స్ రీడ్ చెయ్యటం స్టార్ట్ నుండీ మీలానే ఫీలయ్యాను.
కానీ ఆ "పిచ్చపిచ్చ లైట్" సంకరం కంటే దుమ్ము తెలుగైనా తెలుగే గుమ్ము కదండీ.

Sravya Vattikuti said...

ఓమ్మో కొన్ని కామెంట్లు చదువుతుంటే నాకు నిజం గా నవ్వొస్తుంది మన బ్లాగర్లు కూడా ఎటు గాలివీస్తే అటేనన్నమాట ఇంత అవసరమా .
ఏకలింగం గారు నేను భాష వాటిని పలికే విధానం మీద మీ అభిప్రాయాలూ వినలేదు కాని కొంత మంది మిత్రులు రాసిన పోస్ట్లు వాటి కామెంట్లు చదివాను అందుకే ఇంతగా అవాక్కయ్యాను . మీ దులుపుడు కార్యక్రమం బాగుంది కానీయండి :)
ఇక్కడ వాక్యాలు రాసిన వారు నన్ను మన్నించాలి నేను రాసింది వేరే వాళ్ళ మాటలను , భాషనూ విమర్శించిన వారి గురించి మాత్రమే ఒకవేళ ఈ కామెంట్ ఎవరినైనా భాదిస్తే నా క్షమాపణలు ముందు గానే !

ఏక లింగం said...

@ అజ్ఞాత,
అదొక్కటే కాదు ఇంకా చాలా పదాలు బ్లాగుల ద్వారా వెలుగులోకొచ్చాయి. వాటిగురించి వచ్చే పోస్ట్‌లో చర్చిద్దాం.

@ కన్న,
అవును. మన కృతజ్ఞతలు తెలపడానికి కొన్ని పదాలున్నాయి. కానీ అందరూ వాడే పదాలు మనం వాడితే గొప్పేముంది చెప్పండి. బ్లాగర్లు కొంచెం డిఫరెంట్‌గా ఉండాలి కదా అందుకే ఈ కొత్త పదాల సృష్టి. పాత పదాలు వాడడం వరకు సరే కానీ కొత్త పదాలు కనిపెట్టివాడడం ఎందుకో అర్థం కాలేదు.

@ హరి,
మీకు తెలుసుకదా, అంతర్జాలం అనేది Internet కు మన పండితులు చేసిన మక్కికి మక్కి అనువాదం. అది పిల్లిలా ఉన్నా, పులిలా ఉన్నా వాళ్ళకనవసరం కదండీ.

@ శంభు,
నాయనా శంభు, మీరెవరి గురించి మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. కొంచెం వివరంగా వ్రాస్తారా?

@ సౌమ్య,
మంటనక్క ఒక్కటే కాదండి. ఇంకా ఇలాంటి పదాలు చాలా ఉన్నాయి. వాటిని గురించి తర్వాత పోస్ట్‌లో రాద్దాం అనుకున్నాను. మీరు "నెనర్లు" వాడడం మానకండి. లేక పోతే భాషావెత్తలు నన్నాడిపోసుకుంటారు.

@ అజ్ఞాత,
థాంక్స్.


@ జీవని,
అదేంలేదు... అప్పుడప్పుడిలా కదిలిస్తూ ఉండక పోతే బ్లాగులు బోసి పోవా?

@ నాగేస్రావ్,
"పిచ్చపిచ్చ లైట్" కంటే చాలా మేలేలెండి. కానీ అనవసరమైన పదసృష్టి అవసరం లేదేమో కదా?

ఏక లింగం said...

@ శ్రావ్య,

నేనెవరినీ దులపడం లేదండి. :-)
ఇన్ని రోజులు బ్లాగుల ద్వారా తెలుసుకున్న విశయాలు ఒకసారి గుర్తుకు తెచ్చుకుంటున్నాను. అంతే.

శ్రీనివాస్ said...

ఏకలింగం గారు నెనర్లు , అంతర్జాలం లో మంటనక్క విహారిని ఉపయోగించి మేకు ఈ వాఖ్య పంపుతున్నాను .

శరత్ 'కాలమ్' said...

చక్కగా దులుపుతున్నందుకు/దులుపుకుంటున్నందుకు మీకో వీరతాడు మరియు బోలెడు నెనర్లు :))

మధురవాణి said...

బాగానే చురకలేశారు. 'నెనర్లు' అన్న పదం నాకెందుకో నచ్చదు. కాబట్టి, ధన్యవాదాలు, కృతజ్ఞతలు అనడమే బాగుంటుందనిపిస్తుంది.
ఇహపోతే 'అంతర్జాలం' - హీ హీ హీ ఇది నేనూ వాడుతుంటాను అప్పుడప్పుడూ :-D ఇప్పుడు కాస్త ఆలోచించేలా చేశారుగా! ;-)

తోకలింగం said...

మాతృభాష వెగటైపోయిన ముదనష్టపు జాతి మనది అని ఊరకే అనలేదుగా...

పానీపూరి123 said...

> నా బొంద... నా బొచ్చె
బ్లాగుల్లో ఆ పదాలను ఎప్పుడు వినలేదే? :-))

Malakpet Rowdy said...

LOL :))

Anonymous said...

సాధారణంగా నేను బ్లాగుల్లో వ్యాఖ్యలు చెయ్యను.

ఓ సారి ఓ పెద్దావిడి బ్లాగులో - బ్లాగుల్లో సాహితీ సేవా వగైరాలు ఉన్నాయన్నదాన్ని ఖండిస్తూ నేనొక వ్యాఖ్య చేస్తే నానా గోలా, యాగీ చేసారు కొంతమంది. ఆ వ్యాఖ్యలో నేను నెనర్లు అన్న పదాన్ని ఎత్తి చూపిస్తూ రాసేసరికి సవాళ్ళూ, నిందలూ మొదలయ్యాయి. చాలామందికి రాయడం వరకే ఈ కొత్త పదాలపై మోజు. రోజులో మూడొంతులు ఇంగ్లీషు పదాలే మాట్లాడతారు. భాషాభి వృద్ధి మాట్లాడడంతోనే మొదలవుతుంది. ఈ చిన్న విషయం అందరికీ తెలుసు.

మొన్నొకాయన అచ్చ తెలుగులో ఈమెయిలు కొట్టి, నన్ను కాల్ చెయ్యమంటూ ఆయన టెలీఫోన్ నంబర్లు తెలుగంకెల్లో వేసి పంపాడు. చిర్రెత్తుకొచ్చింది. తెలుగు భాషంటే నాకూ అభిమానమే! కానీ ఇంత పైత్యం లేదు. తెలుగంకెలు వాడడం, కనిపించిన ప్రతీ ఇంగ్లీషు పదానికీ ఒక తెలుగు పుట్టించడం ఇవన్నీ భాష మీద మమకారం పెంచవు, సరికదా వికారం పుట్టిస్తాయి. మనం కొత్త పదాలు పుట్టించనవసరం లేదు. ఉన్నవి సరిగా వాడుకుంటే చాలు.

-బ్రహ్మానందం

Vinay Chakravarthi.Gogineni said...

anonymous comment excellent

@madhuravaani
meku nenarlu nachhaledu kaabatti ala andam baagaledu antaaru.

వీళ్ళు వ్రాసిన ఆర్టికల్స్ బ్రతిమిలాడి బల్మీటికి ప్రచురించుకున్న దాంట్లో
paperlo articles raasedi ee blogs raase amene.pedda daaniki edo saadhichaamani ok aunty roju posts rastundi .........chastunnam choodaleka.

Certified Idiot said...

Well, we (=pre colonial Indians) didn't have a word for "thank you!" because we didn't use that expression. In India, that is not how you acknowledge a favor - not by tossing a meaningless and monotonous word. Thats why, irrespective of the word you use to convey it in your mother tongue, it is bound to be stupid and meaningless because your psych doesn't understand the very concept behind that word. Its just a meaningless nicety.

Same goes for "Sorry" - you don't do something stupid, say "sorry" and call 'we are even'. Thats not how it works!

Its funny people's psych is sold to the western theories of conducting one's self in the world - but they want to do it in their mother tongue. I guess that makes them feel good about their slavery! ;)

Seenu said...

నెనర్లు- వినటానికే విసుగ్గా అనిపిస్తుంది నాకు.
తెలుగు భాషను ఉద్దరించె ఉద్దేశ్యంతొ ఉన్న తెలుగు ఊడేట్లు ఉంది.

ఏలాగు కాన్వెంటు చదువులు సగం తెలుగును ఆంగ్లీకరించాయి.
ఈ మద్యలొ మా చిట్టి చెల్లి నాకు తెలుగు ఎలా రాయోలొ నేర్పింది
"క" రాయాలంటె ఆంగ్ల "S" వ్రాసి right కొట్టాలట
"ర" రాయాలంటె ఆంగ్ల "O" వ్రాసి right కొట్టాలట

ఇక బ్లాగర్ల అత్యుత్సాహం వల్ల కూడ తెలుగు పైన ఈలాంటి
ఎపెక్టె పడుతుంది.

nagarjuna said...

గురువుగారు...,నేను కూడా మొదట్లో కృతజ్ఞతలు అని మొదలుపెట్టి ‘నెనర్ల’లోకి దిగిపోయాను. ఈ విషయంపైన జ్ఞానోదయం చేసినందుకు ధన్యవాదాలు. పోస్టు/టపా/లేఖ కేక...
@ఇడియట్ : :)

మధురవాణి said...

@ Vinay Chakravarthi.Gogineni ,
నేను సరిగ్గా చెప్పలేకపోయానేమో గానీ, నా ఉద్దేశ్యం "ఆ context లో నాకయితే 'నెనర్లు' అని వాడటం కన్నా ధన్యవాదాలు, కృతజ్ఞతలు అనడమే బాగుంటుంది" అని నా వ్యక్తిగత అభిరుచి గురించి ప్రస్తావించానండి. అంతే గానీ, ఎవరు వాడినా నాకు నచ్చదు, ఆ పదం తప్పు వగైరా.. అని నా ఉద్దేశ్యం కాదు. I hope I clarified my words. :-)

శరత్ 'కాలమ్' said...

@ బ్రహ్మానందం
"నన్ను కాల్ చెయ్యమంటూ ఆయన టెలీఫోన్ నంబర్లు తెలుగంకెల్లో వేసి పంపాడు."

అంకెలు తెలుగులో ఎక్కడ కనిపించినా నేను ఇగ్నోర్ చేస్తాను. ఇహ ఫోను నంబర్లు ఇంకా ఎవరూ అలా ఇవ్వలేదు కానీ ఇస్తే మటుకు ఫోను చేసే ప్రసక్తే లేదు. 'పైత్యగాళ్ళకి బుద్ధి మట్టు' అని సామెత సవరించాలేమో!

పద్మ said...

:)

మార్జాలం అదే అంతర్జాలం, మంటనక్క, గూగుల్ గుంపు మటుకు నాకు తెగ నచ్చేసిన పదాలు. మరీ ఇంత తెలుగు అవసరమా? అసలు Firefox ని తెలుగీకరించవలసిన అవసరం ఏముంది? ఈ లెక్కన నా కలీగ్ మేరీ పేరుని కూడా మరియమ్మ అని తెలుగీకరించి పిలుచుకోవాలా? నా పేరుని లోటస్ అని వాళ్ళు ఆంగ్లీకరించుకోవాలా? ఇలా ఆంధ్రీకరించి మాట్లాడుకుంటేనే మాతృభాష మీద భక్తి, గౌరవం అనుకుంటే అంత కన్నా వెర్రి మరొకటి లేదు. ఉన్న పదాలని సరిగ్గా ఉపయోగించుకుంటే చాలు.

Sandeep said...

@Anonymous

""పురికాసు మొలతాడు లా వీరతాడు అని మొదలుపెట్టిన ఘనత ను మరిచిపోయారు""

ఈ వీరతాడు అనే పదం మాయాబజార్ సినిమా నుండి గ్రహించారు. వీలైతే ఆ సినిమా చూడండి. విమర్శకి, తెలియకపోవడానికి సన్నని గీతొకటి అడ్డు ఉంటుంది సుమీ.

Anonymous said...

ఇంకో దరిద్రబ్బాష : "లైట్ తీస్కో" ఇదెక్కడి పిండాకుడి భాషో నాకర్ధం గాదు. ఏమిటి లైట్ తీస్కో, బల్బు తీస్కో, XXX? అసలు తెలుగు వాడేటప్పుడు లైట్ "గా" తీస్కో అని అన్లేరా? ప్రతీ వల్లకాట్లో రామనాధాయా "మీ టూ" అనుకుంటూ ఓ బ్లాగు మొదలెట్టడమే కానీ నాలుగు లైన్లు సరిగ్గా రాసి ఏడుద్దామని లేదు.

ఇలాంటి దరిద్రం ఇంకా ఉంది. "నాకు అనిపిస్తోంది" అని రాయడానికి "నాకు అనిపిస్తుంది" అని రాస్తారు. టెన్స్ మారిపోయిందని కూడా తెలీదా? అన్నింటికన్నా వెధవ బాష (ఒక మహిళామణి గారు దీన్ని బాగా వాడతారు) "వుండింది." నాలుగు బ్లాగులూ, ఒక్కోదాన్లో నాలుగేసి పోస్టులు మొదలెట్టగానే ఏదో పండితులైపోయారనుకోవడం. ఏదైనా అంటే నా బ్లాగు నా ఇష్టం అని ఇంకో ఏడుపు. ఇంతకీ ఈ బ్లాగుల్లో రాసేదేవిటయ్యా అంటే, చింతకాయపచ్చి పులుసు, తియ్యని మజ్జిగ, గూగిల్లో వెతికి తీసిన ఓ పాటకి యూ ట్యూబ్ లింకూను (మజ్జిగలో పంచదార కలిపేరుట, ఆహా, ఒక కొత్త రకం వంట తయారైపోయింది. జయహో పుట్ ఇట్ ఆన్ బ్లాగ్), చావండి గోదాట్లో దూకి @$%^#@!మొహాల్లారా

మంచు.పల్లకీ said...

పాపం ఏకలింగం గారు.. మీ పొస్ట్ చూపించి మరీ ఎలా రాయాలొ జనాలకి క్లాస్ పీకుతున్నారు :-) ఈ లింక్ చూడండి. :-)) ఈ పాపం మీదే .. ఈ సారీయినా మీరు క్షమాపణ చెప్పాల్సిందే..
http://krishna-diary.blogspot.com/2010/06/blog-post.html?showComment=1275591945171#c8277242457479767498

మంచు.పల్లకీ said...

మొదట్లొ నేను చూసింది, నెనరు తరువాత నేనరులు ఆ తరువాత నెనర్లు.. ఎదొ ఒకటి లెండి.. మాయాబజార్ లొ రెలంగి చేత 'వీరతాళ్ళూ ' గిల్పం' అన్న కొత్త పదాలు పుట్టించినందుకు చాలా విమర్శలు వచ్చాయని విన్నాను. కొంతమంది మెచ్చుకుంతు, కొంతమంది తిడుతూ.. అయితే అవి వాడుకలోకి రాలేకపొయాయ్ ..
కొత్త పదాలు సృస్టిస్తే తప్పేముంది .. ఎవరి క్రియేటివిటి వారిది.. అవే వాడమని బలవంతం ఎమీ లేదు కదా.. ఇస్టం అయితే వాడతారు లేకపొతే లేదు.. ఆ మాత్రం బాషా స్వాతంత్రం లేకపొతే ఎలా ? అలానే అనుకుంటే పరమాణువు, విద్యుత్ లాంటి పదాలు పుట్టేవా తెలుగులొ.. అవి ఇంగ్లిష్ నుండి చూసి తెలుగులొ పుట్టించినవే కదా..

హమ్మయ్య .. మొత్తానికి వేరె వైపు కెలుకుడు స్టార్ట్ చేసా..

Vinay Chakravarthi.Gogineni said...

naaku ee blogers lo baaga nachhedentante........ikkada vaddannavaalle
nenarlu ane padam meeda positive ga raasina.........aho oho antoo veltaaru.

madhuravaanigaaru mee ishtam meedi.......

oremuna said...

మీ గత టపా చదివి మీరింకా బ్లాగర్ల మనసులపై పడతారనుకున్నాను. ఇలా భాషపై పడతారనుకోలేదు. :-)

భాస్కర్ రామరాజు said...

బావుందయ్యా

JB - జేబి said...

బాగా చెప్పారు - తెలుగు బ్లాగులు క్రమంగా చదువుతున్నపట్నించీ నేను ఇవి గమనిస్తున్నను. ఈ మధ్య బ్రౌనుగారి తెలుగు వ్యాకరణం చదువుతున్నా - ఆయన 19వ శతాబ్దంలోనే ఇలాంటి పైత్యాలు చాలా వివరించాడు.

Anonymous said...

తెలుగంటే ప్రతొక్కడికి అలుసై పోతుంది. తెలుగు పదాలు వాడితే తప్పేంటంట? ఏం వాడకూడదా? మరేంవాడాలి? కొత్తపదాలు సృష్టిస్తే ఎందుకంత బాద?

Anonymous said...

ఉసుర్లు అని మొన్ననే మొదలుపెట్టింది ఒక మహాతల్లి
చూస్తుంటే ఎసరు ఉసురు అన్నీ పాపులర్ చేసేస్తారు ఏమో
చెయ్యడమే కాకుండా పక్కన వాళ్లతో కూడా మేము పెట్టిన ఎసరకు మీదే బియ్యం అని ఎసరు అని పలికిన్చేవరకు వదలరనుకుంటా :)

ఒక విషయం చెప్పడం లో తప్పులేదు
ఫోర్సు (బలవంతం) చేసి మరీ పక్కవాలతో చెప్పించడం తిమ్మి ని బమ్మి ని చేయడం
జయహో నేనర్ల inventor

Anonymous said...

నేనర్ల inventor అనే కంటే నేనర్లను రుద్దించి తన అభిప్రాయాలను అందరూ గురవించడమే కాకుండా అదే అమలు చెయ్యాలనుకోవడం మూర్ఖత్వం
నెనర్లు ని కనిపెట్టిన వాళ్లతో ఖండ ఖండాలుగా ఖండిస్తున్నాం

శ్రీనివాస్ said...

పై అజ్ఞాత ఎవరో మలక్పేట రౌడీ కి తెల్సు :))

Anonymous said...

>>తెలుగంటే ప్రతొక్కడికి అలుసై పోతుంది. తెలుగు పదాలు వాడితే తప్పేంటంట? ఏం వాడకూడదా? మరేంవాడాలి? కొత్తపదాలు సృష్టిస్తే ఎందుకంత బాద?

reply:ఇప్పుడు మీకోసం ఒక ఉదాహరణ

నేను నేనర్లకు పోటీగా జిమ్మడలు అని మొదలెడతా
జిమ్మడ అంటే జిమ్ము కి వెళ్ళే ఆడమనిషి అని
నేను ఇప్పుడు పిచ్చ పిచ్చగా వాడుతా ఈపదం
ఎందుకంటే

కొత్తపదాలు సృష్టిస్తే ఎందుకంత బాద?

శ్రీనివాస్ said...

జిమ్మడ అంటే జిమ్ముకి వెళ్ళే ఆడమనిషి

హేహేహేహేహే

చదువరి said...

కొత్తపదాలపై ఇక్కడ మాట్టాడేంత భాషాపాండిత్యం లేకున్నా, నా ఆలోచన కొంత చెప్పదలచాను. నెనరుకు కృతజ్ఞత అనే అర్థం ఉన్నదనే సంగతిని మీరు కాదనలేదు, కానీ కొత్తగా అ పదాన్ని వాడాల్సిన అవసరం ఏంటి అంటూ అభ్యంతరం చెబుతున్నారు అని నేను భావిస్తున్నాను.

’కృతజ్ఞతలు అని వాడగలిగినపుడు నెనరులు అని ఎందుకనగూడదు అని పాఠాలు చెబుతారు’ అని అన్నారు. కానీ, దాంతోపాటే, అందులో తప్పేదైనా ఉంటే దాన్ని కూడా ఎత్తి చూపి, వాళ్ళు చెప్పే పాఠం తప్పు అని చెప్పాల్సింది.

"పోనీ ఈ తామరతంపర ఒకాబులరినీ వీళ్ళ బయట ప్రపంచంలో వాడుతారా అంటే అదీ లేదు." -ఒకటి: కొత్తగా పదం వాడుకలోకి వచ్చినపుడు క్రమేణా వ్యాప్తి చెందుతుంది. ఒక్కసారిగా వాడుక వెల్లువెత్తిపోదు!
ఇంకోటి: రాసేభాష మాట్టాడే భాషా వేరువేరుగా ఉంటాయన్నసంగతి మీకు తెలియనిదని నేననుకోను. ఎంచేతంటే, మీరు మాట్టాడేటపుడు ఉత్తరం ’వ్రా’స్తాను, పరీక్ష ’వ్రా’సాను అని అంటారా? రాస్తాను, రాసాను అనే అంటారు. మరి ఈ టపాలో ’వ్రా’సాను అని రాసారు కదా!? కొన్ని వ్యాఖ్యల్లో కూడా గమనించాను.

"అంతర్జాలం" "మార్జాలం" లాగా వినిపించిన వారికి - మరి "పాష్ ఇంగ్లీషు" అనే మాట మొదటిసారి విన్నపుడు "గాష్ ఇంగ్లీషు" లాగానో "ట్రాష్ ఇంగ్లీషు" లాగానో లేక ప్రాస కలిసిన మరేదైనా మాటలాగానో అనిపించిందా?
అనిపించే ఉంటే - మరి ఎలా వాడుతున్నారు?
అనిపించకపోయి ఉంటే - ’అంతర్జాలం’ మాత్రం అలా ఎందుకనిపించింది? (ఈ ప్రశ్న - అలా ఎవరికనిపించిందో వాళ్ళకే!)

మనకు తెలియని విషయాన్ని మరొకరు వాడుతున్నపుడు అదేంటో తెలుసుకోడానికి ప్రయత్నిస్తాం. నచ్చితే వాడేందుకు ప్రయత్నిస్తాం. ’బల్మీటి’ అంటే ఏంటో నాకు తెలవదు. కానీ నేను సందర్భాన్ని బట్టి అర్థం చేసుకోగలిగాను. ’బల్మీటి’యా, అదేంటి? అది వినగానే చలిమిడో, గోర్మీటీయో గుర్తొచ్చింది.. అంటూ ఎక్కిరిస్తే అది మర్యాదా?

ఇహనాపుతాను.. లేకపోతే ఇది ఎక్కడెక్కడికో పోయేట్టుంది. :)

ఏక లింగం said...

శ్రీనివాస్, శరత్ 'కాలమ్', మధురవాణి, పానీపూరి123, Malak, Vinay Chakravarthi.Gogineni, Certified Idiot, Seenu, nagarjuna, పద్మ, Sandeep, మంచు.పల్లకీ, భాస్కర్ రామరాజు, oremuna, JB.

అందరికీ కృతజ్ఞతలు.
@ మంచు,
వచ్చేటపాలో మీరడిగినవి చర్చిద్దాం.
@ oremuna,
అవి కూడా వ్రాస్తాలేండి.

ఏక లింగం said...

@ చదువరి,
నేను బ్లాగులు చదివి భాష గురించి తెలుసుకున్న వాన్నే కానీ భాషావేత్తను కాదులేండి. భాషపైన మీ అంత పట్టులేదు.

నాకు తెలిసినంతలో వివరించడానికి ప్రయత్నిస్తాను.
1)
మన feelings చెప్పే కొన్ని పదాలను మనం ఏకవచనంలోనే వాడతాము కానీ బహువచనంలో వాడము. ఉదా: నా సంతోషం, నా విశ్వాసం, నా ఆకలి వగైరా... కానీ నా సంతోషంలు, నా విశ్వాసంలు, నా ఆకలులు అనంకదా. అలాంటిది నెనరు అనే పదానికి లు కలిపి.. నెనర్లు అని వాడడం ఎందుకన్నదే నా సందేహం. పోనీ నెనర్లు అన్నది బ్లాగు భాషలో తప్ప ఎక్కడైన (బహువచనంగా) ఉందా? ఉంటే చెప్పగలరు. కొంత జ్ఞానాన్ని సంపాదించుకోగలను.

2)
కొన్ని పదాలు ఎన్నిరోజులు కష్టపడ్డా వాడుక భాషలోకి చేరిపోవు. కేవలం అప్పుడప్పుడు భాషాభిమానుల వ్రాతల్లోకనిపిస్తాయి... అని నా అభిప్రాయం.

ఉదా:.. మీరు "టీ" అని అంటారా? లేక "తేనీరు" అని అంటారా?
రైలు అని అంటారా? లేక ధూమశకటం అంటారా?

మనం తెలుగు భాషను రక్షించుకుందాం. "తేనీరు", "ధూమశకటం" లాంటి పదాల వాడకం ఎక్కువ చేద్దాం అని ఎన్నిరోజులు ప్రయత్నించినా అది వృదాప్రయాసే అవుతుందంని నా నమ్మకం. Off course, I may be wrong.

ఇక "వ్రాసాను" అనాలా లేక "రాసాను" అనాలా, "క్రొత్తగా" అనాలా లేక "కొత్తగా" అనాలా అంటే, నా ఉద్దేశంలో ఎలా అయినా వాడుకోవచ్చు. వీటిగురించి చర్చించేంత సాధికారత నాకు లేదు. నేనిక్కడ చెప్పాలనుకున్నది బ్లాగుల్లో కనబడుతున్న కొత్త పదాల గురించి మాత్రమే.

3)
--
మరి "పాష్ ఇంగ్లీషు" అనే మాట మొదటిసారి విన్నపుడు "గాష్ ఇంగ్లీషు" లాగానో "ట్రాష్ ఇంగ్లీషు" లాగానో లేక ప్రాస కలిసిన మరేదైనా మాటలాగానో అనిపించిందా?
--

అనిపించి ఉండొచ్చు. కానీ "అంతర్జాలం" అనే పదాన్ని మాత్రం కావాలని Internet అన్న ఆంగ్ల పదానికి మక్కికి మక్కి అనువాదం చేసి వాడుతున్నారని మీకు తెలియదనుకోను.

4)
"బల్మీటికి" అనేది "బలవంతంగా" అన్న అర్థంతో తెలంగాణలో వాడుకలో ఉన్న పదం. దాని ఎటిమాలజీ ఎంటంటే నాదగ్గర సమాధానం లేదు.
ఇక్కడ నేను ఇతరుల భాషనో, మాండలికాన్నో పరిహాసం చేయదల్చుకోలేదు. కేవలం బ్లాగు భాష గురించే రాద్దాం (వ్రాద్దాం) అనుకున్నాను. కాబట్టి వాటి జోలికి వెళ్ళదల్చుకోలేదు.

చదువరి said...

1) సరిపోయింది. మీరు భాషావేత్త కారు. నేనా.. మీకంటే అన్యాయం! కానీ ఇద్దరం భాష బాగోగుల గురించి మాట్టాడుకుంటన్నాం. :) మూర్ఖంగా ’ఛీ, ఛీ’ అనేవాళ్ళ కంటే మనం చాలా నయంలెండి, కానిద్దాం.

’కృతజ్ఞత’ ’నెనరు’కు సంబంధించి - కృతజ్ఞత, కృతజ్ఞతలు అని అంటాం. అందులో తప్పులేనప్పుడు నెనరు, నెనరులులో తప్పేంటి అనేది నా ప్రశ్నండి.

"ఎక్కడైన (బహువచనంగా) ఉందా?" - ఈ అర్థంలో వాడటం మొదలెట్టిందే ఇక్కడ అయినపుడు ఇంకా ఎక్కడుందో చెప్పమంటే ఏం చెబుతానండి?

2) "కొన్ని పదాలు ఎన్నిరోజులు కష్టపడ్డా వాడుక భాషలోకి చేరిపోవు. కేవలం అప్పుడప్పుడు భాషాభిమానుల వ్రాతల్లోకనిపిస్తాయి... అని నా అభిప్రాయం. " - మీ అభిప్రాయంతో అభ్యంతరమేమీ లేదు. చేరకపోతే పోతాయి. తేనీరూ అలాంటిదే కావచ్చు! ’కొన్ని చేరవు’ అంటే మిగిలిన కొన్ని చేరతాయనేగా? అవి అలాగే ప్రవాహంలో కొనసాగుతాయి. ’సంపాదకుడు’ను వాడటంలా -కనీసం ఇప్పటిదాకా? జనానికి నచ్చినవి నిలబడతాయి, నచ్చనివి పాత బ్లాగుల్లో/పుస్తకాల్లో మునిగిపోతాయి. భాష గతిశీలమైనదని కదా పెద్దలనేది.

"నేనిక్కడ చెప్పాలనుకున్నది బ్లాగుల్లో కనబడుతున్న కొత్త పదాల గురించి మాత్రమే." - నాకర్థమైందండి. నేను చెప్పదలచుకున్నది మాత్రం కొత్త పదాల పట్ల వ్యతిరేకతకు, ప్రేమకూ రెంటికీ కూడా ప్రధాన కారణం భాషపై ఉన్న ప్రేమ అనే! (భాష మీద మమకారం కాకుండా.. చిన్నచూపు ఉండే బాపతు జనాలు కొందరుంటారు, నేను ఆ రకం జనాల గురించి మాట్టాడ్డం లేదండి.) ఎలాగో మూడో పాయింటులో చెబుతాను..
3) "కానీ "అంతర్జాలం" అనే పదాన్ని మాత్రం కావాలని Internet అన్న ఆంగ్ల పదానికి మక్కికి మక్కి అనువాదం చేసి వాడుతున్నారని మీకు తెలియదనుకోను." - అన్నారు. ’ఇంటర్నెట్’అనగానే మీకేమీ అనిపించలేదు.. నెట్టేంటి? మనమేమైనా జాలర్లమా? ఏంటీ చెత్త భాష అని మీకు అనిపించలేదు? ఎంచేతంటే దాని మీద మీకు మమకారం లేదు. అదెట్టా పోయినా మీకనవసరం, ఆ భాషతో మీకు అర్థాలు తెలుస్తాయేమోగానీ, అనుభూతి కలగదు. అంచేతే వెబ్‍సైటు మొదటి పేజీని హోమ్ పేజీ అంటే మీకేమీ అనిపించదు. కానీ తెలుగలా కాదు, అది మాట్టాడ్డంలో, వినడంలో మీరు అనుభూతి చెందుతారు కాబట్టి, అంతర్జాలం అని అనగానే మీకు తేడాగా ఆన్తది.

మక్కికిమక్కి - ఇంటర్నేషనల్, ఇంటర్ కాలేజియేట్, ఇంటర్ సిటీ, ఇంటర్ సర్వీసెస్.. ఈ పదాలను తెలుగులోకి ఎలా అనువదించారో చూడండి.. ఇంటర్నెట్టులో ఇంటరంటే ’అంతర’ కాక ఇంకేంటి? నెట్వర్క్, నెట్,.. అంటే ’జాలం’ కాక ఇంకేంటి?

4) ’బల్మీటి’కి అర్థం మీరు చెప్పనక్కర్లేదండి, సందర్భాన్ని బట్టి తెలిసిపోతోంది.

"కేవలం బ్లాగు భాష గురించే రాద్దాం (వ్రాద్దాం) అనుకున్నాను." - బ్లాగు భాషను మాత్రం పరిహసించడ మెందుకు? -విమర్శించండి.

ఏక లింగం said...

చదువరి గారు,

1)
నెనరు అన్నది తెలుగు పదం కానీ నెనర్లు మాత్రం కేవలం బ్లాగు పదం.

మీరే అన్నారు...
--
ఈ అర్థంలో వాడటం మొదలెట్టిందే ఇక్కడ అయినపుడు ఇంకా ఎక్కడుందో చెప్పమంటే ఏం చెబుతానండి?
--

అదే నేననేది. ఇది కేవలం ఇక్కడ సృష్టించిన పదం అని.

ఒక వేళ నెనర్లు అని వాడడంలో తప్పులేక పోతే, నా అకలులు, నా సంతోషంలు ఇలా అన్నింటిని బహువచనంలో వాడడం సరైనదంటారా? లేక అలాకూడా వాడొచ్చు, ఎవరొద్దన్నారు? ఎవరిష్టం వాళ్లది అంటారా?

2)
నాక్కూడా ఈ బ్లాగు భాషతో ఎటువంటి అభ్యంతరం లేదండి. నేను ఎవరిని నెనర్లు వాడొద్దని చెప్పలేదు. కానీ ఆ పదం ఎలా/ఎక్కడ పుట్టిందో ఒకసారు గుర్తుకు చేసుకున్నానంతే.

3) ఈ అంతర్జాలం ఒక్కటే కాదులేండి. ఇలాంటి బ్లాగు పదాలు చాలా ఉన్నాయి. వాటి గురించి వచ్చే పోస్ట్‌లో రాద్దాం అనుకున్నాను.

వాడెవడో ఇంటర్‌నెట్ కనిపెట్టినోడు ఆపేరు పెట్టుకున్నాడు. అది వాడిష్టం. కానీ మనం వాడవలసి వచ్చేసరికి తెలుగులోకి తర్జుమా చేస్తే గాని మనకు మనసొప్పదు. ఏం? ఇంటర్‌నెట్ అని వాడిలాగే పిలిస్తే తప్పేంటి?

రేప్పొద్దున మనము ఇంకోటి కనిపెట్టి దానిని "అచికిబుచికి" అని పేరు పెట్టుకుంటే అందరూ అలా పిలవడానికే ప్రయత్నిస్తారు. అంతేకాని వాడి భాషలోకి పదానికి పదం కలిపి మార్చేసి పిలుచుకోరు కదా (నా ఉద్దేశంలో).
మన పందికొక్కును ఇంగ్లీషోడు నోరు తిరక్క bandicoot అన్నాడు అంతేకాని ప్రతి పదానికి సమాన పదం కలిపి పిగ్ ?? (కొక్కును ఇంగ్లీష్లో ఏమంటరో తెలీదు) అనలేదు కదా?
అలా ప్రతిపదాన్ని మారుద్దాం అనుకుంటే, సీతాకోకచిలుక అన్న అందమైన పదాన్ని తీసేసే వాడెవడో Butterfly అన్నాడని మనంకూడా వెన్నఈగ అనడం మొదలు పెడదామా?

4) ఇక్కడ నేను బ్లాగు భాషను పరిహసించడం లేదు, విమర్శించడం లేదు. ఇక్కడి భాషపై కేవలం నా అభిప్రాయాన్ని చెప్పానంతే?

చదువరి said...

హరి దోర్నాల:
తెలంగాణలో వాడే అర్థం మీరు చెప్పారు.

బ్రౌణ్యం ఇలా అంది: నెనరు (p. 0678) [ nenaru ] nenaru. [Tel.] n. Affection, love. ప్రేమ. Gratitude, కృతజ్ఞత.


రాయలసీమలో ప్రేమ ఆప్యాయత, అనే అర్థంలో ’నెర్లు’ అనే మాట వాడతారని నెనరుపై జరిగిన చర్చలో డా. ఇస్మాయిల్ గారు చెప్పారు.

ఒకేమాటను ఒక్కో ప్రాంతంలో ఒక్కో అర్థంలో వాడతారని మీకు తెలియందేమీ కాదు. దానివలన ఎగతాళి చేసారని మీరు గతంలో నా బ్లాగులో రాసారు గుర్తుందా సార్? "నేను 'బొక్క' అంటే, 'ఛీ, అదేమిటీ, ఎముక అనాలి' అని దెప్పి పొడిచే వారు. తెలంగాణా లో to make it empty అనే అర్థం లో 'వడ చేస్తారు' అని వాడుతారు. ఈ మాట వాడిన ప్రతీ సారి 'వడ చేస్తావా, ఇడ్లీ చేస్తావా' అని నవ్వే వారు." అని రాసారు మీరు. మరి ఇక్కడి టపాలో హేళన అగుపడలేదా మీకు?

మీ అమ్మాయినీ, ఆమెకు ఉష్ణోగ్రత అనే మాటను నేర్పిన పత్రికో, చానెలో - దాన్నీ అభినందిస్తున్నాను.
------------

అన్నట్టు ఏకలింగం గారూ, రాయలసీమలో ’నెర్లు’ అనేమాట వాడతారంట. బహువచనమే!

ఏక లింగం said...

చదువరి గారు,
---
రాయలసీమలో ’నెర్లు’ అనేమాట వాడతారంట
---

అలా అయితే బ్లాగుల్లో కూడా నెర్లు అని వాడమనండి. నెనర్లు అని ఎందుకు? వాడుకలో ఉన్న పదాన్ని పాడితే ఎవరూ ఏమీ అనరు కదా?

దయచేసి...
మనము ఇక్కడి చర్చను కేవలం బ్లాగు పదాలవరకే పరిమితం చేద్దాం సార్. మాండలికాల్లోకి, కోస్తా, రాయలసీమ, తెలంగాణ పదాల్లోకి వెళితే మన చర్చ ప్రక్కదారి పట్టి మన చేతుల్లో లేకుండా పోతుంది.

ఏక లింగం said...

చిన్న సవరణ, పై కామెంట్‌లో,

పదాన్ని పాడితే ఎవరూ....
కాదు
పదాన్ని వాడితే ఎవరూ....

అని చదువుకోగలరు.

చదువరి said...

ఏకలింగం గారూ, హేళన గురించి చెప్పేందుకు అది వాడాను. అంతే తప్ప దురుద్దేశం లేదు.
---------------
"అలా ప్రతిపదాన్ని మారుద్దాం అనుకుంటే, సీతాకోకచిలుక అన్న అందమైన పదాన్ని తీసేసే వాడెవడో Butterfly అన్నాడని మనంకూడా వెన్నఈగ అనడం మొదలు పెడదామా?" - సరిగ్గా ఇదే ముక్క నేననేది. ఇప్పటికే మనకున్న పదాలను వదిలేసి, ఇలా ఇంగ్లీషు పదాలనే వాడాల్సిన అవసరం ఏంటి? పదాలను సృష్టించుకోగలిగిన సాధన సంపత్తి భాషకు ఉన్నప్పుడు ఎందుకు సృష్టించుకోకూడదు?

బ్లాగుల్లో కొత్త పదాలు వస్తే మీకు ఇబ్బందేంటి? ఇష్టం లేనపుడు వాడనక్కరలేదు. వాడమని బలవంతం లేదు కదా! హేళన చెయ్యడమెందుకు? "కొన్ని రోజులకు ఇవే ప్రామాణిక పదాలయి బ్లాగుల్లో రాజ్యమేలుతయి." - అవి ప్రామాణికమైతే మంచిదే కదా? భయమెందుకు? ప్రామాణికం కాకపోతే సహజంగానే కనుమరుగౌతాయి.

"అలా అయితే బ్లాగుల్లో కూడా నెర్లు అని వాడమనండి. నెనర్లు అని ఎందుకు?" - :) అది నెనర్లు అనేమాటకు రూపాంతరమే అయ్యుండొచ్చని ఆయన ఊహ. అంతే తప్ప, ఆయన్ని ఇందులోకి లాక్కండి.

చదువరి said...

ఏకలింగం గారూ, నేను చెప్పదలచిన నాలుగు ముక్కలకూ అవకాశమిచ్చినందుకు నెనరులు! :)

ఏక లింగం said...

మీ అభిప్రాయాలు చెప్పినందుకు చాలా కృతజ్ఞతలు చదువరి గారు.
మీ ప్రశ్నలకు ఇంకో పోస్ట్‌లో సమాధానం చెప్పగలనేమో ప్రయత్నిస్తాను.

---
అది నెనర్లు అనేమాటకు రూపాంతరమే అయ్యుండొచ్చని ఆయన ఊహ. అంతే తప్ప, ఆయన్ని ఇందులోకి లాక్కండి.
---

ఇక్కడ కామెంట్స్ రాసిన వారి గురించి తప్ప నేను మిగతా వారి గురించి మాట్లాడింది లేదు. ఎవరినీ ఇక్కడికి లాగింది లేదండి. నాకాఅవసరం కూడాలేదు.

Thanks once again.

శరత్ 'కాలమ్' said...

@ Anonymous
జిమ్ముకి వెళ్ళే ఆడాళ్లని జిమ్మడ అంటారు సరే, జిమ్ముకు వెళ్ళి కండలు పెంచే నాలాంటి మగవారిని ఏమనొచ్చో కూడా చెబుదురూ. జిమ్ముడు?

హరి దోర్నాల said...

చదువరి గారు,

అప్పుడు మీరిచ్చిన సమాధానం కూడా గుర్తుకు తెచ్చుకోండి.

నెనరు కి నేను కేవలం నాకు తెలిసిన అర్థం చెప్పాను. అంతకన్నా ఏం లేదు. వెనకటికి 'పిల్లి అంటే ఏమిటి అని అడిగితే మార్జాలం అని జవాబిచ్చాడట' అని సామెత. నా వ్యతిరేకత అలాంటి పదాల గురించి. ముఖ్యంగా సంస్కృతం నుండి అరువు తెచ్చుకొని తయారు చేసే పదాల గురించి, 'తెలుగు మహిళా బహిర్భూభాగ పథకం' లాగా. ఇందులో తెలుగు అనే పదం తప్ప తెలుగేముంది చెప్పండి? అలాగే వేడి, వేడిమి లాంటి పదాలుండగా ఉష్ణ + ఉగ్ర + త, ఇంత అవసరమా? ఇది కేవలం నా అభిప్రాయం మాత్రమే, ఎవరిపైనా హేళన కాదు.

తెలుగులో పదాలను పెంపొందించడానికి నేను వ్యతిరేకిని కాను. నెల విడిచి సాము చేసినట్టు తెలుగు పదాల పేరుతో తెలుగును వదిలేసి సంస్కృతం వెంట పరుగులు తీయడానికి మాత్రమే వ్యతిరేకిని.

హరి దోర్నాల said...

బల్మీటికి...

మా వైపు బల్మీదికి అంటారు.

బలిమి + మీద అని ఉత్పత్యర్థం చెప్పుకోవచ్చు.

మంచు.పల్లకీ said...

ఏకలింగం గారు.. పదాల సృస్టి విషయం పై మీ వాదనతొ ఎకీభవించలేకపొతున్నా.. ఎలాగు నెక్స్ట్ పొస్ట్ అన్నారు కాబట్టి అందుకొసం వెయిటింగ్ :-))

శ్రీనివాస్ said...

@ శరత్ 'కాలమ్'

జిమ్ముకి వెళ్లి కండలు పెంచే మగాళ్ళని జిమ్మర్ అంటారు. మీలాంటి మగాళ్ళని ఏమంటారో తెలీదు :))

Seenu said...

@ చదువరి
అయ్యా మీరు ఏ ప్రాంతం వారో తెలియదు కాని, తెలంగాణ ప్రాంతంలొ మాత్రం "బల్మీటికి" అనె పదం నెను చిన్నప్పటి నుండి వింటున్నదే.

ఇకపోతె మీ వాదన
@@@@"పదాలను సృష్టించుకోగలిగిన సాధన సంపత్తి భాషకు ఉన్నప్పుడు ఎందుకు సృష్టించుకోకూడదు? "

ఏవరైన క్రొత్తగా నెట్ చదివే కుర్రాళ్ళు జలబాండము, దూమ శకటము, బహిర్బూమి, వాహన చోదకుడు వగైరా వగైరా లాంటివి చదివితే ఇదెక్కడి గోడవరా బాబు ఇంగ్లిషే బెస్టు అనుకునే ప్రమాదం లేదంటారా.

ఇంతగా తికమక పెట్టె తెలుగు చదివేకంటె ఎలాగు ఉద్యోగం ఆగ్లం లోనె కదా వెలగ బెట్టెది, ఒకే దెబ్బకు రెండు పిట్టలు అనుకొని ఆంగ్లం వైపు మళ్ళరంటారా??

@@@@"బ్లాగుల్లో కొత్త పదాలు వస్తే మీకు ఇబ్బందేంటి?"

సంతోషం వస్తె ఇబ్బంది లేదు. కాని, ఇబ్బంది పెట్టె పదాల గురించె ఇక్కడ మాట్లడుతున్నది.
కాని మీరు ఇలా దెప్పి పొడువటం ఏం బాలెదు. ఇక్కడ ఎవ్వరు బ్లాగరు బాషను బహిశ్కరిద్దాం, జీహాద్ అని అనలేదు కదా, చర్చ నడుస్తుంది అంతే.

Anonymous said...

నాకైతే నెనర్లు అని విన్నప్పుడల్లా కామెర్లలా వినిపించేది.
ఇది బ్లాగోత్తములు సృష్టించిన పదం అని మీరు చెప్తేనే తెలిసింది. ఇన్నిరోజులు పిచ్చోళ్ళను చేసారుకదా.
మీ పొస్ట్‌కు థాంక్స్

Anonymous said...

పోస్ట్ బావుంది. కామెంట్స్ ఇంకా బావున్నాయి.
నేను బ్లాగులు చవడం మొదలెట్టిన రోజుల్లో పద్యాలు రాసే ఒక గుంపు తెలుగుగ్రవాదం ప్రదర్శించేది. పాపం కొత్తగా కీబోర్డ్ పై తెలుగురాస్తూ తప్పులు దొర్లే బ్లాగుల్లోకి వెళ్ళి వాళ్ళ తాట వలిచేవాళ్లు. సాహిత్యానికి పట్టిన చీడంటూ చిన్నా చితకా బ్లాగర్లను ఈసడించేవారు :(
ఈ తెలుగు పదాలు కనిపేట్టే వాళ్ళ్కి నిజమైన తెలుగు తెలుసా. ఓ సారి కాకతీయుల నాటి శాసనాలని వీళ్ళతో చదివించాలి :)