Wednesday, 28 July 2010

మాలిక బాలారిష్టాలు

సుమారు మూడు నెలల క్రితం, మడిగట్టుకోని బ్లాగర్లను అడ్డ మీద మనతోపాటు ఉండనిద్దామా లేక హారతిచ్చి పంపిద్దామా అని ప్రజాభిప్రాయ సేకరణ పెట్టేంత వరకు ఒక కొత్త అగ్రిగేటర్ పెట్టాలి అన్న ఆలోచన ఏమీ లేదు. కాని పెద్దన్న అనుకున్నవాళ్ళే వద్దని వెళ్ళగొడతానన్నప్పుడు తెలుగు బ్లాగుల్లో ఒక తటస్థ వేదిక యొక్క అవసరం తెలిసొచ్చింది. ఆ పోస్ట్ చూసిన తర్వాత, బ్లాగర్లు ఏం వ్రాయాలో/వ్రాయకూడదో నిర్ణయించని, బ్లాగు వ్యవహారాల్లో తలదూర్చని ఒక సంకలినిని తయారు చేయాలి అన్న నిర్ణయం జరిగింది. ఇంతకు ముందు ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నా ఈసారి మాత్రం అలా వదిలేయదల్చుకోలేదు.

వెంటనే నేను, భరద్వాజ్, ఆర్కే, విమల్, పద్మ కలిసి ఓ యాక్షన్ టీం రెడీ అయింది. మొదట head-on collision కే సిద్ధమయ్యాము. kadali.org పేరుపైన అచ్చుగుద్దినట్లు ఒక సైట్ చేయడానికి అన్నీ ఏర్పాట్లు జరిగిపోయాయి. సైట్ రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది. ఒక పదిహేను రోజుల్లో మొదటి దశ అగ్రిగేటర్ పనికి సిద్ధం అయింది. తొందర్లోనే ఒక వేగవంతమైన అగ్రిగేటర్ వస్తుంది అని, "ఉప్పొంగే కడలి" అని పోస్ట్ వ్రాసి చెప్పడం జరిగింది.

అయితే...ఎలాగూ ఇంత చేసి కాపీ కొట్టారు అన్న పేరు ఎందుకు తెచ్చుకోవాలి, పోటీకి వెళ్ళినట్లు కాకుండా మనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుందాం, ఒక ఆదర్శవంతమైన సంకలిని తయారు చేద్దాం అని, మా నిర్ణయం మార్చుకుని కడలి పేరు కాకుండా ఇంకేదైనా పేరు పెట్టాలనుకున్నాము. అప్పుడు భరద్వాజ్ మాలిక పేరు బాగుంటుందని అది పెడదామని ఆ పేరు రిజిస్టర్ చేయించాడు.

ఆ తర్వాత ఎక్కడ నుండి హోస్ట్ చేద్దామని కొన్ని రోజులు తర్జనభర్జనలు జరిగాయి. మొదట కొత్త అకౌంట్ తీసుకోవడం ఎందుకు, విమల్‌కు అల్‌రెడీ అకౌంట్ ఉన్న డ్రీమ్‌హోస్ట్ (http://dreamhost.com) సర్వర్ పై నుండి మాలికను నడుపుదాం అనుకున్నా, వాడు cron jobs నడపడానికి వీలుకాదు అని చెప్పడంతో తక్కువ ధరకు ఎవడు హోస్టింగ్ అకౌంట్ ఇస్తుండని చూస్తే వెబ్‌హోస్టింగ్‌పాడ్ (http://webhostingpad.com) వాడు కనబడ్డాడు, నెలకు రెండు డాలర్లే, ఆలసించిన ఆశాభంగం, ఈ ఒక్క రోజే ఈ అవకాశం అని బోర్డ్ పెట్టుకొని. హమ్మయ్య...కరెక్ట్ టైమ్‌లో అగ్వకు దొరికిండు, మళ్ళీ ఈ ఆఫర్ రేపు ఉంటుందో లేదోనని వెబ్‌హోస్టింగ్‌పాడ్ వానితో వెంటనే ఓ మూడేళ్ళకు సర్వర్ గుత్తకు మాట్లాడుకున్నాము(ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఆ బ్యానర్ అలాగే ఉంది). ఆ తర్వాత అన్ని ప్రోగ్రామ్స్ బాగానే నడుస్తున్నాయని ఒకటి, రెండు రోజులు పరిక్షించి ఏప్రిల్ 19th, 2010 రోజు మాలిక పూరిస్థాయిలో విడుదల చేయడం జరిగింది.

మాలికకు తెలుగు బ్లాగర్ల నుండి మేము ఊహించని దానికంటే మంచి స్పందన వచ్చింది. కొద్ది రోజుల్లోనే అందరి ఆదరనకు నోచుకొని తనకంటూ ఒక స్థానాన్ని కల్పించుకుంది. కానీ... అసలు కష్టాలు అప్పుడే మొదలయ్యాయి.

మే 25st, 2010 రోజు హఠాత్తుగా మాలిక అకౌంట్ సస్పెండ్ అయింది అన్న మెసేజ్ చూసి ఇదేం గొడవరా బాబూ అని వెంటనే web hosting pad వాన్ని ఆడగడం జరిగింది. వాడేమో "మీ ప్రోగ్రామ్స్ మా సర్వర్ cpu అంతా వాడుకుంటున్నాయి అందుకే మీ అకౌంట్ సస్పెండ్ చేసి పారేసాము" అని తీరిగ్గా చెప్పాడు. సరే మేము ప్రోగ్రామ్స్ అన్నీ "low priority" నడిపిస్తాము, మీ cpu కు ఏమీ కాకుండా, తొందరగా మళ్ళీ అకౌంట్ ఇవ్వరా బాబు లేక పోతే మా ఇజ్జత్ పోయేట్టుంది అని వేడుకుంటే "మళ్ళీ ఇలా చెయ్యొద్దని" వార్నింగ్ ఇచ్చి అకౌంట్ అక్టివేట్ చేసాడు. బ్రతుకు జీవుడా అనుకొని ప్రోగ్రామ్స్ అన్నీ మార్చాము, cpu పైన ఎఫెక్ట్ పడకుండా, అలాగే అగ్రిగేషన్ స్పీడూ తగ్గకుండా.

అలా ఓ నెల పదిహేను రోజుల పాటు అన్నీ బాగానే నడిచాయి. కానీ, జులై 14th, 2010 రోజు మళ్ళీ కథ మొదటికి వచ్చింది. సేమ్ స్టోరి. మళ్ళీ అకౌంట్ సస్పెండ్ అయిన మెసేజ్. ఈసారేమైంది అని అడిగితే, మీ ప్రోగ్రామ్స్ చాలా memory వాడుకుంటున్నాయి. మీరు షేర్డ్ సర్వర్ లో ఈ ప్రోగ్రామ్స్ నడపడానికి వీలు కాదు. మళ్ళీసారి మీరు ఈ ప్రోగ్రామ్స్ నడపనని మాటిస్తేనే అకౌంట్ ఇస్తా అని ఖరాకండిగా చెప్పాడు. అలా అంటే ఎలా, మీరే ఏదో దారి చూపండి స్వామీ అంటే, మీ లాంటి వాళ్ళ కోసమే మేము డెడికేటెడ్ సర్వర్లు, అటు ఇటు కాకుండా ఉండే వర్చువల్ ప్రైవేట్ సర్వర్లు పెట్టాము. మీరు అక్కడ ఎగిరినా దుంకినా తందనానలాడినా ఎవరూ అడగరు. ఆ ఆకౌంట్ తీసుకొని అక్కడ మీ ఇష్టం వచ్చినట్లు చేసుకోండి. కానీ దానికి కొంచెం ఖర్చవుతుంది అని అన్నాడు.

మెల్లిగా బ్లేడు బయటకి తీస్తున్నాడని అర్థం అయింది. సరే... వాటికి ఎంతంటాడో చూద్దాం అని
ఎంత? అని అడిగితే
నెలకు $50 అని చెప్పాడు. (http://www.webhostingpad.com/vps-package.html)

"అన్నా... నమస్తే" అని ఓ సలామ్ కొట్టి వచ్చాము.

వీడేదో తిరుపతి గుండు చేస్తడనుకుంటే సర్వాంగ క్షవరం చేయడానికి రెడీ అయ్యాడు. వీడితో వెలితే పని అయ్యేట్లు లేదనుకుని, డ్రీమ్ హోస్ట్ వాడు ఏమైనా సందిస్తాడేమో అని వాన్ని అడిగితే, "చల్... గా కథలు గిక్కడ నడ్వై" అని తిట్టినంత పని చేసి పంపాడు.

ఇప్పుడేలా మరి. మంత్రసానితనానికి ఒప్పుకొని మధ్యలో వదిలిపెడతా అంటే వీలుకాదు. డెడికేటెడ్ సర్వర్ తీసుకొని నాటకం నడుపుదాం అంటే అంతో ఇంతో ఖర్చు అయ్యేట్లు ఉంది. మరెలా అంటే, ఒక్క సారి తొడకొట్టిన తర్వాత మంట పుట్టినా బొప్పి కట్టినా వెనక్కి వెల్లొద్దని, నాతో పాటు సర్వర్ ఖర్చులు తానూ పంచుకుంటాని భరద్వజ్ ముందుకొచ్చాడు.

Hakuna matata అనుకుని, పొత్తుల సర్వర్లతోటి ఎప్పుడైనా కిరికిరే అని చెప్పి, సరాసరి డెడికేటెడ్ సర్వర్ కాకుండా మొదట ఓ వర్చువల్ ప్రైవేట్ సర్వర్(VPS) తీసుకుని చూడాలనుకున్నాము. ఈసారి ఒక్కసారిగా సంవత్సరాల కొద్ది కాంట్రాక్ట్ తీసుకోకుండా మొదట చీపుగా ఓ సర్వర్ తీసుకొని అక్కడ పని మొదలుపెట్టి బాగుంది అనిపిస్తే పూర్తిగా అక్కడికి మారిపోదాం అని నిర్ణయించికుని ఎవడు చీపుగ వర్చువల్ సర్వర్ ఇస్తుండు అని గూగులోన్ని అడిగితే, వాడు VPSlink వాని పేరు చెప్పాడు. VPSlink, VPSlink... మాకో వర్చువల్ సర్వర్ చీపుగా కావాలి ఎంతకిస్తావు అని అడిగితే, డెడ్ చీపుగా నెలకు $8 కే ఇస్తానన్నాడు. సరే ఇదేదో బాగానే ఉంది కదా ఓ నెల రోజుల పాటు చూద్దాం అని వాని వెంట వెళ్ళాము. వాడేమో, వినాయకున్ని చేసివ్వరా అంటే వాడబ్బను చేసిస్తా అని లింగం చేతిలో పెట్టినట్లు ఓ బేసిక్ సర్వర్ చేతికిచ్చాడు. అందులో ఏమీ ఇంస్టాల్ చేసుకోడానికి వీళులేదు. కేవలం ప్రాసెసర్, బ్యాండ్‌విడ్త్ వాడుకోవడం తప్ప. మెమొరీ కూడా ముష్టేసినట్టు 64MB ఇచ్చాడు. ఏదో ఒకటి ప్రస్తుతం షో నడిపించడానికి ఈ మాత్రం చాలు అని, మళ్ళీ ప్రోగ్రామ్స్ అన్నీ మార్చి, అక్కడ ప్రాసెసింగ్, వెబ్‌హోస్టింగ్‌పాడ్ వాని దగ్గర షోయింగ్‌లా చేసాము. అప్పటి నుండి ఇప్పటి వరకు మాలిక అలాగే నడుస్తుంది. కానీ ముందు ముందు ఇంకా డెవలప్ చేయడానికి ఈ సెటప్ సరిపోదు.

ఎప్పటికైనా తప్పేట్టు లేదనుకొని మొన్ననే ఒక డెడికేటెడ్‌ సర్వర్‌కు బేరంపెట్టి ఓ తెల్ల దొరకు బయాన కూడా ఇచ్చాము. వచ్చే నెల, 15 నుండి మాలిక డెడికేటెడ్ సర్వర్ నుండి నడుస్తుంది. అయితే ఈ డెడికేటెడ్ సర్వర్‌ను కేవలం ప్రాసెసింగ్ సర్వర్‌లా ఉపయోగించుకుని, హోస్టింగ్‌ మాత్రం వెబ్‌హోస్టింగ్‌పాడ్ సర్వర్ నుండే కొనసాగుతుంది. వెబ్‌హోస్టింగ్‌పాడ్ వాన్ని ఊరికే వదిలివేయడం ఇష్టం లేదు. వాడితో తిన్న డబ్బులు కక్కించాల్సిందే. అంతే కాకుండా డెడికేటెడ్ సర్వర్లోనే వెబ్ సర్వర్ పెట్టుకుంటే, సైట్ సెక్యూరిటీతోపాటు సర్వర్ సెక్యూరిటికీ కూడా చూస్తూ 24 గంటలు కుక్క కాపలా కాయాల్చి వస్తది. ఏమాత్రం సందు దొరికినా ఏ టర్కీ వాడో వచ్చి జండా ఎగరేసి జై కొట్టగలడు. ఆ తిప్పలు తప్పించుకోవడానికి డ్యూయల్ సర్వర్ కాన్ఫిగరేషన్‌లో నడపాలని నిర్ణయించుకున్నాము.


ఇవీ మాలిక బాలారిష్టాలు. వచ్చే టపాలో భవిష్యత్తులో మాలిక ఎలా మారబోతుంది. ఏ ఫీచర్స్ ఉంటాయి, ఏవి ఉండవో చూద్దాం.
(పని ఒత్తిడి వల్ల ఈ రోజు కామెంట్స్ అప్రూవ్ చేయడానికి కొద్దిగా టైమ్ పట్టొచ్చు... )

29 comments:

Anonymous said...

" రేపటి టపాలో మాలిక మొదలు పెట్టడానికి కారణాలు, మేము పడ్డ ఇబ్బందులు, మరియు ఎల్లుండి టపాలో భవిష్యత్తులో మాలిక ఎలా ఉంటుందో/ఎలా ఉండదో చదవండి........."

మాట నిలుపుకున్నావ్, ఐ లవ్ యు...

ఏకలింగం అభిమాని.

Praveen Sarma said...

ఏకలింగం అన్నా. ఇట్లాంటిది ఏదో జరుగుతుందని నేను ముందే ఊహించాను. మీ మాలిక సర్వర్ ని tracert లో చూసినప్పుడే తెలిసింది అది షేర్డ్ సర్వర్ అని. నా అగ్రెగేటర్ teluguwebmedia.asia VPSలో ఉంది. క్రాన్ రన్నింగ్ తో 128MB డెడికేటెడ్ RAM స్లో అయిపోయి 256MBకి అప్ గ్రేడ్ చెయ్యించాను. వెబ్ హోస్టింగ్ కంపెనీలు షేర్డ్ సర్వర్ లో ఫ్రీక్వెంట్ క్రాన్ రన్నింగ్ కి ఎలా చెయ్యనిస్తాయా అని నాకు ముందే డౌట్ వచ్చింది. అందుకే మీ మాలిక ఇప్పుడు కాకపోయినా తరువాతైనా స్లో అవుతుందని ఊహించాను.ఇంతకు ముందు నేను టెక్సాస్ సర్వర్ కంపెనీకి నెలకి 26 డాలర్లు కట్టేవాడిని. RAM అప్ గ్రేడ్ చేసిన తరువాత 31 డాలర్లకి ధర పెరిగింది. తక్కువ ఖర్చుకి వెబ్ సైట్లు హోస్ట్ చేస్తే ఇలాగే అవుతుంది.

శ్రీనివాస్ said...

:)

Wit Real said...

>> వినాయకున్ని చేసివ్వరా అంటే వాడబ్బను చేసిస్తా అని
>> లింగం చేతిలో పెట్టినట్లు

LOL! That's typical IT BDM ;)

కొండముది సాయికిరణ్ కుమార్ said...

ఏకలింగం గారు - మీకు మీ టీముకు అభినందనలు. దాదాపు ఇలాంటి ఇబ్బందులతోపాటు మరికొన్ని ఇతర సమస్యల మధ్యే మా ఆవకాయ.కాం కూడా మొదలయ్యింది.

బై ద వే, బ్లాగులో పెట్టేందుకు రెడీమేడ్ లంకె, మాలికలో ఎక్కడి నుంచి తీసుకోవాలి.

సుజాత said...

రాసిన రెండో నిమిషంలో మాలిక లో టపా వస్తుంటే వావ్ అనుకోడమే తప్ప ఇన్ని కష్టాలున్నాయని అనుకోలేదు. కష్ట నష్టాలకోర్చి నిర్వహిస్తున్న అందరికీ శుభాభినందనలు.!

చేతన_Chetana said...

మీ సర్వర్ల భాష పూర్తిగా అర్థం కాలేదు కానీ, అన్ని కష్టనష్టాలు పడుతూ నిర్వహిస్తున్నా మీ మాలికా చాలా బాగుంది. నా ఫొటోలు బాగా కనిపిస్తున్నాయి, ఇంచుమించు వెంటనే కనిపిస్తున్నాయి, అంతకన్నా నాకింకేమి కావాలి. కొన్ని కొత్త ఫీచర్సు ఉన్నట్టూ, అనవసరపు సరకు లేనట్టూ కూడా తెలుస్తుంది. బాగుంది.

శ్రీనివాస్ said...

సుజాత గారు మాలిక గురించి ప్రింట్ మీడియా లో మీరొక వ్యాసం వ్రాస్తే బాగుంటుంది అని నా అభిప్రాయం :)

డా.ఆచార్య ఫణీంద్ర said...

పెక్కు పెదవుల పయి వెలయగా చిరునవ్వు,
నెత్తి కెత్తుకొన్న నిర్వహణము -
చిక్కులిన్ని తెచ్చి చీకాకు పరిచెనా?
ధన్యవాదములివె తమరి కృషికి!

శరత్ 'కాలమ్' said...

ఏకలింగాన్ని ఎవరో నోరారా 'అన్నా' అని అంటున్నారే! ఈ లెక్కన ఏకలింగం నాకు ఏం వరుసవుతాడబ్బా!?

Malakpet Rowdy said...

Srinivas

Looking at your point from a different perspective - If we provide high quality services, the media would cover us sooner or later.. right?

ఏక లింగం said...

@ అజ్ఞాత,
మీ అభిమానానికి థాంక్యూ.

@ ఫ్రవీణ్,
మొదటి సారి అనుకుంటా ఇక్కడ కామెంట్ వ్రాయడం :)

అన్నా, వదిన వరసలెందుకు కానీ, సింపుల్ గా ఏకలింగం పేరుపైనే కథ నడిపిద్దాం.

మాలిక స్లో అవడం అంటూ ఎప్పుడూ జరగలేదు/జరగదు. ఇవన్నీ కొన్ని ప్రారంభపు అడ్డంకులు అంతే. వెళుతూ ఉంటే అన్నీ సర్దుకుంటాయి. అందుకే ఈ తిప్పలేవి లేకుండా ఉండడానికని డెడికేటెడ్ సర్వర్ తీసుకోవడం జరిగింది.

శ్రీనివాస్, విట్‌రియల్... థాంక్స్

swapna@kalalaprapancham said...

Keep it up guys

ఏక లింగం said...

@ సాయి కిరణ్,
మొన్నోసారి రఘుతో మాట్లాడినప్పుడు ఆవకాయ గురించి చెప్పాడు. మీరుకూడా చాలానే కష్టపడ్డారు కదా!!

మాలిక బటన్ కోడ్ ఇక్కడ ఉంది.
http://maalika.org/support_maalika.php
---

థాంక్స్ సుజాత గారు.


@ చేతన,
ఫోటోలు రిసైజ్ చేయకుండా పూర్తిగా చూపాలి అన్న ఉద్దేశంతో ఒక పూర్తి పేజి కేటాయించడం జరిగి. వచ్చే మాలికలో ఫోటోబ్లాగర్లను ముందు పేజిలోకి తీసుకురావలనుకుంటున్నాము.
---

ఆచార్య ఫణీధ్ర గారు కృతజ్ఞతలు.

---

@ శరత్,
మీ వరుసలేవో మీరూమీరూ తేల్చుకోండి బాబు. మధ్యలో నన్నెందుకు లాగడం చెప్పు. :)

ఏక లింగం said...

థాంక్స్ స్వప్న.

మధురవాణి said...

సుజాత గారు చెప్పినట్టు.. నేను కూడా వావ్ అనుకున్నాను గానీ, దాని వెనకాల ఇంతమంది ఇంత కష్టపడ్డారని అస్సలు అయిడియా లేదు. ఎవరి బ్లాగుని వాళ్ళు పట్టించుకోడానికే చాలా కష్టపడిపోతున్నట్టు ఫీలైపోతుంటాం. అలాంటిది అందరి కోసం ఇంత కష్టపడి 'మాలిక' ను విజయవంతంగా నిర్వహిస్తున్న మాలిక టీం మెంబర్స్ అందరికీ హృదయపూర్వక అభినందనలు మరియు ధన్యవాదాలు! Keep Rocking! :-)

తార said...

మాలికలో నేను నా ఫీడ్ బాక్ ఇద్దామనుకోని, చాల్లే చెప్పొచ్చవు పెద్ద చెసే వాళ్ళకి కుదరొద్దూ అని నాకు నేనే అనుకున్నాను..
ఐనా ఎంత కాలం ఇలా మీరే ఖర్చులు భరిస్తారు, ప్రకటనలతో ఆదాయం పెంచుకునే మార్గాలు అన్వేషించాలి, అప్పుడు అది అందరికీ మంచిది అని నా భావన.
డెడికేటెడ్ ఐతే అధమం 1500$ పైనే పడుతుంది, మిగతావి అన్నీ కలుపుకుంటే పాతిక లక్షలు పైనే ఖర్చు పెట్టి ఉంటారు (శ్రమకి విలువ కట్టాను కాని మీ కమిట్మెంట్ కి కాదు), నిర్వాహణకి ప్రతి యేడు అంతే అవుతుంది, తెలుగు బ్లాగులతో సంవత్సరానికి కోటి రూపాయలకి పైగా వ్యాపారం చేసే అవకాశం ఐతే ఉన్నది అన్న మాట.

ఇట్లు
ఏకలింగం అన్నయ్యగారికి నమస్కారములతో,
భవదీయుడు..

tracertతో ఏ ప్లాన్ తో హోస్ట్ చేసారో, డెడికేటెడ్ సర్వరో, షేర్డ్ హోస్టింగో తెలుసుకోవటం ఎలానో ఒక టపా రాసి వివరింపగలరు. అదే చేత్తో క్రాస్ రన్నింగ్ అంటే ఎంటో చెప్పండి ప్లీజ్.

హరే కృష్ణ said...

Hearty Congratulations

Anonymous said...

డెడికేటెడ్ సర్వరూ గొడవలూ ఏమీ తెలియవు కానీ, మీ డెడికేటెడ్ టీం కి మాత్రం అభినందనలు !!

చేతన_Chetana said...

లింగంగారు, ఫొటోలు రిసైజు చేసినా పర్వాలేదు కానీ aspect ratio చెడకుండా ఉంటే చాలు.

ranjani said...

@ తార()
>>ఐనా ఎంత కాలం ఇలా మీరే ఖర్చులు భరిస్తారు,
>>ప్రకటనలతో ఆదాయం పెంచుకునే మార్గాలు అన్వేషించాలి

మన టెక్నాలజీ ఎంతో అభివృద్ధి చెందినా,
ప్రస్తుతానికి తెలుగు సైట్లకీ వాణిజ్య ప్రకటనలకీ సరిపడదు..

>> క్రాస్ రన్నింగ్
CRON running : http://en.wikipedia.org/wiki/Cron

>> tracert
trace route : http://en.wikipedia.org/wiki/Traceroute

మంచు.పల్లకీ said...

1లింగం అన్నయ్యగారు ... మీకు , మాలిక టీం కు మరొక్కసారి అభినందనలు :-)

@ శరత్.. మీరు తప్ప అందరూ ప్ర నా ని అన్న అనే పిలుస్తారు. అందుకే మీరు "మహాజనానికి ముద్దుల బావ" :-)

తార said...

క్రాన్ జాబ్స్ ఆ.

ranjani గారు, లేదు, ఖర్చు ఉంటే, ఆదాయమూ ఉంటుంది, మార్గం వెతకాలి అంతే తప్ప, ప్రస్తుతానికి లేదు అనటం కన్నా, ఆ బాట ఎదో మనమే వెయ్యాలి.

ఆ.సౌమ్య said...

ఏమిటో మీరు చెప్పినది ఒక్క ముక్క అర్థం కాలేదు, ఆ సర్వర్లు ,ఆ ఆగ్రిగేటర్ల గోడవేమిటోగానీ మీ కష్టం మాత్రం కనిపిస్తున్నాది. చెమటోడ్చి చేస్తున్న పనికి ప్రతిఫలం బాగుండక ఏం చేస్తుంది. మాలికలో కామెంట్లు అవీ వెంటనే కనిపించేస్తూ ఉంటే ప్రాణానికి హాయిగా ఉంది. నిజంగా మీరు చేస్తున్న పని అభినందనీయం. మీకు మీ టీం కి కృతజ్ఞతలు మరొక్కసారి అభినందనలు.

Amar said...

1and1.com gives you servers (vps or dedicated) at cheaper prices.

ఏక లింగం said...

Thanks Madhuravaani, Harekrishna, Harephala, Chetana, Manchu and Sowmya.

@ తార,
ప్రస్తూతం సర్వర్ ఖర్చులు మేము భరించే స్థాయిలోనే ఉన్నాయి కాబట్టి భవిష్యత్తులో మాలిక లో ఆడ్స్ ఏమీ ఉండక పోవచ్చు.

@ ranjani,
తార క్రాన్ గురించి అడిగింది కామెడీ కోసం అనుకుంటా. మీరు నిజమే అనుకున్నట్టున్నారు.

@ Amar,
Thank you for the info. We already signed a contract with another provider.

Gani said...

Good Stuff!!

బుద్దా మురళి said...

చాల కాలం క్రితం బ్లాగ్ ప్రరంబించినా ఈ మద్యనే పోస్ట్ చేస్తున్న తెరవెనుక వ్యవహారం ఇంతుందని తెలియదు . ఏ రంగం లోనైనా ఏక స్వామ్యాన్ని ఒప్పుకోవద్దు . మీ క్రుచికి అభినందనలు

ఏక లింగం said...

మురళి గారు,
మీ స్పందనకు ధన్యవాదాలు. కొన్ని రోజుల నుండి ఇంటర్‌నెట్‌కు దూరంగా ఉండడంతో మీ వ్యాఖ్య ప్రచురించడం ఆలస్యం అయింది. మన్నించగలరు.

Post a Comment