Monday, 7 September 2009

జగన్నాటకం...

పసందైన రాజకీయ నాటకానికి రంగస్థల వేదికగా రాష్ట్రం మారింది. తెరచాటు వేషగాల్లు ఇప్పుడిప్పుడే పాత్రలతో సిద్ధమవుతున్నారు. తెరముందు వేషగాల్లు అప్పుడే వాళ్ల నటనా కౌషలం ప్రదిర్శించడం మొదలు పెట్టారు. కల్తీ లేని నటన, విమర్శకు వీలులేని అభినయం, యాచకులు నేర్చుకోదగ్గ వాచకం, స్వచ్చమయిన స్వార్దం, వెరసి మన ముందుకొచ్చిన జగన్నాటకం. ఒక ఉగ్రనరసింహ్ముని వేషం రాష్ట్రాన్ని నిప్పుల కొలిమిగా చేస్తానంటే, ఒక అమ్మవారి ఆకారం రక్తం ఏరులై పారిస్తానంటుంది. అన్ని వేషాలు కలిసి రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేస్తాయట.

ఈ నటచక్రవర్తులకు తోడు భజన బృందాలు. ఒకడు కీర్తనలు పాడుతడు, ఒకడు ప్రార్థనలు చేస్తాడు, మద్దెల వాయించేవాడు ఒకడయితే, తాళాలు కొట్టేవాడు మరొకడు, ఉడతలు పట్టేవాడు కూడా వీలుచూసుకొని చిడతలు కొడుతున్నాడు. ఈ విద్యలెందులో ప్రవేశం లేని వాళ్లు దరువుకు అనుగుణంగా, శృతి తప్పకుండా ఆరున్నొక్కరాగం ఆలాపిస్తున్నరు.

వేషమేదయినా, భజన ఎవరు చేసినా, ఏడుపు ఎవరేడ్చినా... ఈ నాటకంలో చివరగా అందరికీ కావలసింది ఒక్కటే, అదే యువరాజు గారి పట్టాభిషేకం. తండ్రి "ఆశయాలు" పూర్తిచేయడం ఆయన కుమారుడికి ఒక్కడికే సాధ్యమవుతుందట. తండ్రిగారి నాయకత్వ పఠిమా పాటవాన్ని జన్మతా అందిపుచ్చుకున్నాడట. ఇదంతా చూసి ఇదేమయినా మూర్చ రోగమా తల్లిదండ్రులకు ఉంటే వంశపారంపర్యంగా పిల్లలకు రావడానికి అని అనుకోకండి, కాదు..కుర్చీ రోగం. దానికీ దీనికీ తేడా ఒక్కటే, మూర్చతో కొట్టుకోవడం పుట్టుకతో వస్తే, కుర్చీని పట్టుకోవడం తల్లి లేదా తండ్రి మరణం నుండి సంక్రమిస్తుంది.

ఈ జరిగే తతంగం తోటి రాష్ట్రంలోని టీవీ చానెల్స్ కు కావలసినంత సరకు దొరికింది. కెమరా కన్నులకు ఇదో కలర్ ఫుల్ కార్నివాల్. చచ్చినోడి పెళ్ళికి వచ్చిందే కట్నం అన్న చందంగా SMS polls పేరుతో సందెట్లో సడేమియాలా శవాల మీద పేలాలు ఏరుకుంటున్నారు. చచ్చినవాడి ఆత్మశాంతి దేవుడెరుగు, బ్రతికిన వాల్లకి మనశ్శాంతిని లేకుండా చేస్తున్నారు.

రాజకీయ నాయకునికి ఉండవలసిన ప్రాథమిక లక్షణం, అందితే జుట్టు పట్టుకోవాడం, అందకపోతే కాళ్లు పట్టుకోవడం. ఇవి రెండూ దొరకక పోతే....నడుము పట్టుకోవడం. అక్కడనుండి మన వీలూ వివరం చూసుకొని అవసరానికి అనుగుణంగా వీలయితే పైకి, కాకపోతే క్రిందికి ప్రయాణం చేయొచ్చు. ఈ నడుమునే పండితులు "జఘనం" అంటే, నోరు తిరగని రాజకీయ నాయకులు "జగను" అంటారు.

-ఏకలింగం

-----------
(గత కొద్దిరోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయాలను, రాజకీయ నాయకుల ఓవర్ యాక్షను చూసి, థూ.. అనిపించి...)